ప్రపంచాన్ని కుదిపేసిన ఫొటోనే ఇలా..
ఎర్రచొక్కా, నీలిరంగు నిక్కరు ధరించిన నాలుగేళ్ల సిరియా బాలుడు ఆయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఫొటో లక్షలాది మంది ప్రజల హృదయాలను కదిలించింది. అనేకమందికి కన్నీళ్లు తెప్పించిన ఆ విషయం గుర్తుండే ఉంటుంది. కన్నీళ్లు కారుస్తున్న నిశ్శబ్ద ప్రకృతి మధ్య ఇసుకపై బోర్లాపడిన బాలుడి చెంపలను అలలు తాకుతున్నట్లుగా కనిపించే ఫొటో సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు సృష్టిస్తున్న మారణకాండ నుంచి తప్పించుకునేందుకు యూరప్ బాట పట్టిన సిరియా, ఇరాక్ శరణార్థుల గురించి మొట్టమొదటి సారిగా ప్రపంచం పట్టించుకోవడానికి ఈ ఫొటోనే కారణమైంది.
అచ్చం ఆ ఫొటోలో కనిపించినట్లుగా ఆ బాలుడి విగ్రహాన్ని చెక్కారు ఫిన్లాండ్కు చెందిన ప్రముఖ శిల్పి పెక్కా జిల్హా. 'అంటిల్ ది సీ షెల్ హిమ్ ఫ్రీ' అని దానికి టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ బాలుడి విగ్రహాన్ని టర్కీ రాజధాని హెల్సింకీ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటుచేశారు. బాలుడు ఆయలాన్ కుర్దీ, అతడితో పాటు తండ్రి మినహా ఐదుగురు కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన ఇద్దరు మానవ అక్రమ రవాణాదారులు టర్కీ జైల్లో ఉన్నారు. వారిపై విచారణ కొనసాగుతోంది. నేరం రుజువైతే వారికి 35 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
సిరియా, ఇరాక్ ప్రాంతాల నుంచి వచ్చిన శరణార్థులు టర్కీ నుంచి యూరప్‌కు వెళుతూ వందలాది మంది సముద్రంలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. టర్కీ అధికార లెక్కల ప్రకారమే గత ఒక్క నెలలోనే 400 మంది శరణార్థులు నీట మునిగి చనిపోయారు. వాస్తవానికి మృతుల సంఖ్య మూడింతలు ఉంటుందని అనధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.