అయోధ్య, ఫైజాబాద్‌లలో ఉద్రిక్తత
అయోధ్య/ఫైజాబాద్: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తలపెట్టిన 84 కిలోమీటర్ల యాత్రతో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య-ఫైజాబాద్ జంట పట్టణాలతోసహా వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. సుమారు 350 మంది వీహెచ్‌పీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం, ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేయడంతో పరిస్థితి వేడెక్కింది. సాధువులు, సన్యాసులతో వీహెచ్‌పీ ఆదివారం (నేడు) సరయూ ఘాట్ నుంచి అయోధ్యకు 84 కి.మీ. యాత్రను ప్రారంభించనుండగా, మత ఘర్షణలు తలెత్తే ప్రమాదముందంటూ యాత్రపై యూపీ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే.యాత్ర ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 13 వరకూ ఆరు జిల్లాల మీదుగా అయోధ్య వరకూ సాగనుంది. నిషేధం అమలులో భాగంగా పోలీసులు శుక్రవారం వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను గృహనిర్బంధంలో ఉంచగా.. శనివారం వీహెచ్‌పీకి చెందిన 350 మంది నేతలు, కార్యకర్తలను అరెస్టుచేశారు. అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలతో సహా 70 మంది వీహెచ్‌పీ నాయకులపై, 300 మందికిపైగా కార్యకర్తలపై వారెంట్లు జారీ అయ్యాయని, అయోధ్య-ఫైజాబాద్‌తోపాటు అనేకచోట్ల తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రకటనల వల్లే ఉద్రిక్తత: వీహెచ్‌పీ యాత్రపై కొందరు చేస్తున్న ప్రకటనల వల్లే ఉద్రిక్తత ఏర్పడిందని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. యాత్రపై వ్యాఖ్యలు చేయడం ఆపేస్తే అది ప్రశాంతంగానే ముగుస్తుందన్నారు. బీజేపీకి రాజకీయ లబ్ధికోసమే వీహెచ్‌పీ యాత్ర తలపెట్టిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు చేసిన విమర్శలను ఆమె ఖండించారు.