ఈఏపీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ సంస్థల రుణ సహకారం(ఈఏపీ)తో రాష్ట్రంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.1600 కోట్లతో చేపట్టే ఆంధ్రప్రదేశ్ సామాజిక నీటి యాజమాన్య పథకం (ఏపీసీడబ్ల్యూఎంపీ) రెండో దశ పథకం ఒకటి.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐడబ్ల్యూఎంపీహెచ్ఐపీ – ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్, పోస్టు హార్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ప్రాజెక్ట్) కొనసాగింపులో భాగంగా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ నుంచి రుణం తీసుకుని రూ.రెండు వేల కోట్లతో చేపట్టే పథకం మరొకటి. ఇటీవల నీతి అయోగ్ ఆమోదించడంతో జూలై 27న కేంద్ర జలవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ పథకాలకోసం అప్పటిలోనే దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతగానో కృషిచేశారు.