ముస్లిం యోగా శిక్షకుల నియామకంపై దుమారం
న్యూఢిల్లీ: 'వరల్డ్ యోగా డే' సందర్భంగా ముస్లింలను యోగా శిక్షకులు, టీచర్లుగా నియమించకపోవడంపై వివాదం చెలరేగింది. తాత్కాలిక ప్రాతిపదికన ఎంపికచేసిన శిక్షకుల్లో ముస్లిం అభ్యర్థులకు చోటు దక్కకపోవడంతో.. ఒక విధానం ప్రకారమే ముస్లింలను యోగా టీచర్లుగా నియమించడం లేదంటూ వచ్చిన ఆరోపణలను కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ తోసిపుచ్చారు. ఇది తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారమని ఖండించారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. దీనిపై పూర్తి విచారణకు ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గత ఏడాది అక్టోబర్ 15న జరిగిన ప్రపంచ యోగా దినం కోసం ఉద్దేశించిన నియామకాల్లో ముస్లిం అభ్యర్థులకు మొండిచేయి చూపారంటూ అంతర్జాతీయ పత్రిక ది హఫింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 711 మంది అభ్యర్థులలో.. ఒక్క ముస్లిం టీచర్ను కూడా ఎంపిక చేయలేదని ఆ పత్రిక పేర్కొంది. దీనిపై జర్నలిస్టు పుష్పా శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ముస్లిం అభ్యర్థుల సంఖ్య, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య తదితర వివరాలు కావాలని కోరారు. 3,841 ముస్లిం అభ్యర్థులలో ఒక్కరూ ఎంపిక కాలేదని సమాధానం వచ్చింది. దీంతో వివాదం చెలరేగింది.
కాగా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతిలకు సంబంధించిన మంత్రిత్వశాఖ ఆయూష్. ఈ శాఖ ప్రధానంగా సంప్రదాయ ఔషధాలకు ప్రోత్సాహాన్నిస్తుంది.