దళిత ఉద్యమాలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలం
హైదరాబాద్: అభ్యుదయ దళిత ఉద్యమాల చరిత్రను గుర్తించడంలో కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సమాంతర ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో భీమ్‌సేన నాయకుడు బి.శ్యాంసుందర్ 105వ జయంతి వేడుకలు ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన గద్దర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాల కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు.
ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే కమ్యూనిస్టు పార్టీలు పుట్టినా ఉద్యమ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కమ్యూనిస్టులు వెనుకబడిపోయారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక నిజాంలను పొగుడుతున్న పాలకులు, అప్పటి ప్రజాస్వామిక ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని గద్దర్ ప్రశ్నించారు. కార్యక్రమంలో ‘సజీవ దహనం’,‘ శ్యాంసుందర్ ఉద్యమ ప్రస్థానం’ ‘భూదేవతావోంకా మేనిఫెస్టో’ పుస్తకాలను ఆవిష్కరించారు.
కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
పూటకో మాట మాట్లాడే సీఎం కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఎక్కువ మాట్లాడితే కేసీఆర్‌కు మరింత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు అవుతుందన్నారు. కాబట్టి మీడియా కూడా ఇలాంటి విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. లక్ష నాగళ్లతో రామోజీ ఫిలింసిటీని దున్నేస్తామన్న కేసీఆర్, చివరకు రామోజీరావు కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ, దలిత్ వాయిస్ ఎడిటర్ వి.టి.రాజశేఖర్, భారతీయ భీమ్‌సేన నాయకులు హెచ్.శ్రేయస్కర్, రచయిత మక్సూద్, ఓయూ స్కాలర్ కుమారస్వామి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఎఐఎవైఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్, ఎంఐఎం నేత మోహన్‌రావు పాల్గొన్నారు.
ఓయూలో...
ఉస్మానియా యూనివర్సిటీ: భీమ్‌సేన స్థాపకుడు, అణగారిన దళితజాతుల విముక్తినేత బత్తుల శ్యాంసుందర్ 105వ జయంతిని ఓయూలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన శ్యాంసుందర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీడీఎఫ్ పరిశోధకులు డాక్టర్ నాగం కుమార్, మంచాల లింగస్వామి, ప్రభాకర్, అరుణ్, ప్రవీణ్, దివాకర్, కార్తీక్, మధు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.