baahubali the conclusion
-
మరో రికార్డును బద్ధలు కొట్టిన బాహుబలి
-
మరో రికార్డు.. రూ.500కోట్లు దాటేసింది
హైదరాబాద్: బాహుబలి 2 మరో రికార్డును బద్ధలు కొట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500కోట్ల మార్క్‌ను దాటేసింది. బాక్స్ఆఫీస్ ఇండియా డాట్ కామ్ ప్రకారం గడిచిన మూడు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్ల సునామీతో రూ.506కోట్లను వసూళ్లు చేసింది. ఇది ప్రివ్యూలతో కలిపితే రూ.520 కోట్లు. ఇందులో ఒక్క భారత్‌లోనే మొత్తం వసూళ్లు రూ.385కోట్లు ఉండగా.. విదేశాల్లో రూ.121 కోట్లు. అమెరికా, కెనడా, గల్ఫ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది వరకు ఉన్న రికార్డులు అన్ని కూడా ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి కన్‌క్లూజన్ గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు మంచి కథాబలం తోడవడంతో దుమ్మురేచిపోయే రేంజ్లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో మరో వారం రోజులకు సరిపోయేలా టికెట్లు బుక్కయ్యాయి. దీని ప్రకారం వెయ్యి కోట్ల మార్క్‌ను దాటేందుకు మరెన్నో రోజులు ఈ చిత్రానికి పట్టకపోవచ్చు. -
బాహుబలి 2కి రజనీకాంత్ రివ్యూ
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి-2 చిత్రానికి తలైవా, దక్షిణాది ప్రముఖ నటుడు రజనీకాంత్ రివ్యూ ఇచ్చారు. భారతదేశం ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేంత గొప్ప చిత్రం బాహుబలి -2అన్నారు. వీకెండ్లో కుటుంబంతో కలిసి సినిమాను చూసిన ఆయన దర్శక ధీరుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. ‘భారతీయ సినిమాకు బాహుబలి-2 గర్వకారణం. దేవీపుత్రుడు(గాడ్ ఓన్ చైల్డ్) రాజమౌళి, అతడి టీంకు నా వందనాలు. ఈ చిత్రం నిజంగా ఓ తురుపుముక్క’ అంటూ ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన రాజమౌళి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘తలైవా.... దేవుడే మమ్మల్ని దీవించినట్లుగా ఉంది.. మేమంతా గాల్లో తేలుతున్నాం. ఇంతకంటే పెద్ద ప్రశంస ఉండదు’ తిరిగి రాజమౌళి తలైవాకు రీట్వీట్ చేశారు. శుక్రవారం విడుదలైన బాహుబలి 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం ప్రారంభం రోజే రూ.121కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసింది. హిందీ వెర్షన్లో కూడా విడుదలై దాదాపు రూ.40కోట్లను వసూలు చేసి ఆమిర్‌ఖాన్ దంగల్ చిత్రం ఓపెనింగ్ డే రికార్డును కూడా తుడిచిపారేసింది. ప్రస్తుతం మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టే దిశగా బాహుబలి-2 దూసుకెళుతోంది. Baahubali 2 ... indian cinema's pride. My salutes to God's own child @ssrajamouli and his team!!! #masterpiece — Rajinikanth (@superstarrajini) 30 April 2017 THALAIVAAAA... Feeling like god himself blessed us... our team is on cloud9... Anything couldn't be bigger... -
బాహుబలితో ఢీ..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుండటంతో ఆ దరిదాపుల్లో ఓ మాదిరి సినిమా రిలీజ్ చేయడానికి కూడా సినీ ప్రముఖుల సాహసించటం లేదు. బాహుబలి రిలీజ్‌కు ముందు వారం ఒకటి రెండు సినిమాలను విడుదల చేస్తున్నా.. రిలీజ్ తరువాత మాత్రం పదిహేను రోజుల పాటు మరే సినిమా థియేటర్లలోకి రాదని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ చిన్న సినిమాలు బాహుబలితో ఢీ అంటున్నాయి. ఇప్పటికే బాహుబలి రిలీజ్ అయిన వారం తరువాత అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన బాబు బాగా బిజీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు మరో చిన్న సినిమా మరింత రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది. హ్యాపిడేస్ ఫేం రాహుల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాపురం సినిమాను బాహుబలి రిలీజ్ అయిన తరువాతి రోజు (ఏప్రిల్ 29)న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎవరి మార్కెట్ వారిదే అనుకున్నారో లేక, బాహుబలి టికెట్ దొరకని వారైనా మన సినిమా చూస్తారని భావిస్తున్నారో గాని.., వెంకటాపురం చిత్రయూనిట్ నిర్ణయానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిన్న సినిమా బాహుబలి సునామీని తట్టుకొని ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. -
సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి
-
సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి
హైదరాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నదాని కంటే కూడా భారీ స్థాయిల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. అప్పటినుంచి నాన్ బాహుబలి రికార్డులు అనే మాట కూడా కొత్తగా మొదలైంది. ఇప్పుడు బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, మహేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడన్న ప్రశ్నలు సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమా విశ్లేషకుల వరకు అందరికీ వస్తున్నాయి. షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిన తరుణంలో ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఒక ఈవెంట్లో విడుదల చేశారు. సంకెళ్లు తెంచుకుంటూ సిక్స్‌ప్యాక్ బాడీతో, మెడలో గంటతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్‌ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నా, నిర్మాతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బాహుబలి బరిలో దిగుతున్నాడు
బాహుబలి.. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద సగర్వంగా నిలబెట్టిన విజువల్ వండర్. ఇప్పటికే ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు సీక్వల్తో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తొలి సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ లోగో తప్ప మరే పోస్టర్ రిలీజ్ చేయకపోయినా సినిమా మీద హైప్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఆ అంచనాలు మరింతగా పెంచేందుకు తొలి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు బాహుబలి యూనిట్. ముంబైలో జరుగుతున్న మామీ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ రోజు(శనివారం) సాయంత్రం 4 గంటలకకు బాహుబలి 2 తొలి పోస్టర్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా మీద ఉన్న హైప్‌తో ఈ పోస్టర్ టీజర్లు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో సరికొత్త రికార్డ్లను సృష్టించటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఈ రోజు నుంచి అధికారంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. తొలి భాగం సక్సెస్‌లో ప్రమోషన్ ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో రెండో భాగానికి కూడా అదే స్థాయిలో భారీ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.