శభాష్ అలీ......
హైదరాబాద్ : బీబీసీ గుర్తించిన అతి పిన్న వయస్కుడైన ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మూడు రోజుల పాటు జరుగనున్న జాతీయ యువ సదస్సులో తొలి రోజున 2009 అక్టోబర్లో బీబీసీ గుర్తించిన అతి పిన్న వయస్కుడైన ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ యువ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈ సందర్భంగా బాబర్ అలీని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బాబ్త గ్రామానికి చెందిన బాబర్ 16 ఏళ్ల వయసులోనేప్రపంచ గుర్తింపు పొందడం విశేషం. వివేకానందుడి స్ఫూర్తితో తొమ్మిదేళ్ల వయసులోనే గ్రామంలోని పేద పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించారాయన. పది మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ పాఠశాల ప్రస్తుతం 1100 మంది విద్యార్థులు, 10 మంది టీచర్లతో కొనసాగుతోంది. వీరంతా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటూ స్వచ్ఛందంగా సేవలందిస్తుండడం గమనార్హం. సీఎన్ఎన్ ఐబీఎన్ న్యూస్ ఛానల్ వారి రియల్ హీరోస్ అవార్డును బాబర్అలీ 2009లో అందుకున్నారు.