‘జూ’జీహెచ్!
పనిచేయని ఏసీల్లో ఎలుకలు.. మూలల్లో.. కలుగుల్లో పాములు.. ఇవన్నీ ఏ ‘జూ’లోనో కాదు. సాక్షాత్తూ మన పెద్దాసుపత్రిలో..! వీటికంటే ప్రమాదకరంగా నిర్లక్ష్యం కూడా ఇక్కడ వేళ్లూనుకుని ఉంది. మూషికాల దాడిలో పసికందు మృత్యుఒడి చేరినా.. సర్పాల భయంతో విధులు చేయలేమని సిబ్బంది మొత్తుకుంటున్నా.. అధికారులు, ప్రభుత్వం తీరు మాత్రం మారదు. ఈ వరుస దురదృష్టకర ఘటనలు అందరినీ కలచి వేస్తున్నా వీరి మనసు మాత్రం కరగదు.
- గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మొన్న ఎలుక కాటు.. నిన్న పాముల సంచారం
- తాజాగా రోగి చేతివేలును కరిచిన ఎలుక
- రోగుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూషికాల దాడిలో పసికందు మృతి చెందిన ఘటనతోనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఆసుపత్రి అధికారుల్లో కనువిప్పు కలుగుతుందేమోనని అంతా భావించారు. ఘటన జరిగిన వారం రోజులు వారంతా హడావుడి చేసి వదిలేశారు. శుక్రవారం రేడియాలజీ విభాగం 105వ నంబర్ గదిలో రక్తపింజరు పాము గమనించిన రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది మరువక ముందే శుక్రవారం రాత్రి ఆర్థోపెడిక్ విభాగంలో చెయ్యి విరిగి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న రాయపాటి యేసమ్మ చేతి వేలును ఎలుక కొరకడం తీవ్ర కలకలం రేపింది. ఇంత జరిగితే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఎలుక కరవలేదని రోగుల చేత చెప్పించే ప్రయత్నాలు చేయడం దారుణ ం.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
జీజీహెచ్‌లో రోగుల భద్రతపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో.. రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల నుంచి రక్షణ కల్పించలేక 15 రోజులుగా సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ) మూతపడినా, పిల్లల శస్త్ర చికిత్సా విభాగంలో చేరేందుకు రోగులు విముఖత చూపుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూరోసర్జరీ విభాగంలో ఆపరేషన్ కోసం ఎదురుచూస్తూ పదిహేను రోజులుగా ముగ్గురు రోగులు మంచాలపై మూలుగుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
ప్రభుత్వ ఉదాసీన వైఖరి.. మూషికాల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మరోవైపు జీజీహెచ్ ప్రతిష్టను దిగార్చింది. నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులు జీజీహెచ్‌లో హడావిడి చేసి తూతూమంత్రంగా మృత శిశువు తల్లిదండ్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. జీజీహెచ్‌లోని అధికారులు, వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. నెలరోజులు కావస్తున్నా ఇంతవరకూ ఉత్తర్వులు మాత్రం వారికి అందలేదు. పాములు, ఎలుకలు ఆసుపత్రిలో సంచరిస్తున్నా వాటిని నివారించి తప్పుదిద్దుకోవాల్సిన ఆసుపత్రి అధికారులు మాత్రం రోగులను బెదిరించి ఎలుకలు కరవలేదని బొంకే ప్రయత్నాలు చేయడం క్షమించరాని విషయమని వైద్యులు, సిబ్బందే మండిపడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి జీజీహెచ్‌ని ప్రక్షాళన చేసి పెద్దాసుపత్రిని రక్షించాలని పలువురు కోరుతున్నారు.