'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినప్పటినుంచి అధికార పక్షంపై విమర్శలదాడిని పెంచిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఈసారి ఏకంగా ఆదేశ సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబట్టారు. స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతినిస్తూ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు అనైతికమని విమర్శించారు.
'ఆడా- మగ మధ్య వివాహం జరగడం దైవనిర్ణయం. దానికి విరుద్ధంగా స్వలింగ వివాహాలను ప్రోత్సహించడం తప్పు. భూమి మీదున్న ఏ కోర్టులూ ఆ నియమాన్ని మార్చలేవు. అలా ప్రయత్నించడం దారుణం, ఆక్షేపనీయం. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు శరాఘాతం లాంటిదనడంలో ఎలాంటి సందేహంలేదు' అని జిందాల్ వ్యాఖ్యానించారు. ఓబామా కేర్ ను కోర్టులు ఆకాశానికెత్తడంపైగా అసహనం వ్యక్తం చేశారు.
శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణగానీ, రాష్ట్రాల ఆమోదంగానీ లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పూర్తిగా అదుపుతప్పిందని, జ్యుడీషియరీ సభ్యులు తమ సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.