చీమలపుట్టలో పసిపాప!!
లోకంలో పాపం, పుణ్యం అంటే ఏంటో ఇంకా ఆ పసికందుకు తెలియదు. కానీ ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన నేరం. ఆ నేరానికి గాను ఆమెను చీమలపుట్టలో వదిలిపెట్టారు కసాయి తల్లిదండ్రులు. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని తేని జిల్లా వీరజక్కమ్మాళ్పురంలో వెలుగుచూసింది. చీమలు విపరీతంగా కుడుతుండటంతో బాధ భరించలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు గమనించి ఆమెను బయటకు తీసి, పోలీసులకు తెలిపారు.
పోలీసులు ఆమెను వెంటనే తేనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి, ఆమెకు చికిత్స అందించారు. ఆమె ముఖం, ఇతర భాగాలు చీమలు కుట్టడం వల్ల బాగా వాచాయని వైద్యులు తెలిపారు. పాప త్వరగా కోలుకుంటోందని, ఆమె శరీర బరువు సాధారణంగానే ఉందని చెప్పారు.