Baby girl sale
-
కన్నబిడ్డను రూ.5 వేలకు అమ్మేసింది
మెదక్, సాక్షి: పోషించే స్థోమత లేకపోవడంతో ఒక గిరిజన మహిళ తన కన్నబిడ్డనే అమ్ముకున్న ఉదంతం మొదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిలిపిచెడ్ మండలంలోని బద్రియ తండాకు చెందిన లంగోత్ దుర్గా,సంగీతాలకు ఇద్దరు ఆడపిల్లలు.. మూడో కాన్పు కోసం మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించడంతో ఆర్థికభారం భరించలేక ఆ బిడ్డను బుధవారం అమ్మకానికి పెట్టగా.. నాగమణి అనే ఆశా కార్యకర్త మధ్యవర్తిత్వం వహించింది. రాధ అనే మహిళకు ఐదువేల రూపాయలకు శిశువును విక్రయించే విధంగా ఒప్పందం కుదిరింది. ఆసుపత్రిలో డెలివరీ చేసిన ఓ వైద్యుడు ఈ విషయాన్ని బయటకి తేవడంతో శిశువు విక్రయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను కన్నతల్లికి అప్పగించగా.. మధ్యవర్తిత్వం వహించిన ఆశా కార్యకర్తపై కేసు నమోదు చేశారు. తనకు పిల్లలు కలగకపోవడంతోనే ఆడబిడ్డను కొనుగోలు చేసినట్లు రాధ చెబుతోంది. శిశువును అధికారులు కన్నతల్లి వద్దకు చేర్చారు. -
కొడుకు కోసం చూసి.. కూతురుని అమ్మేశారు
సాక్షి, వర్ధన్న పేట : వారు ఇద్దరు-వారికి ఇద్దరు కూతుర్లు. అయినా కొడుకు కావాలంటూ మూడోసారి మందులు వాడారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సంగతి తెలియక పూజలు కూడా చేశారు. అయినా మూడో సంతానంగా మరో ఆడశిశువుకు జన్మనిచ్చారు. దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ అప్పుడే పుట్టిన ముక్కుపచ్చలారని పసిబిడ్డను అంగడిలో వస్తువులా అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న ఊరి వాసులు నిలదీయడంతో తప్పు ఒప్పుకున్నారు.. వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డిసితాండాకు చెందిన మాలోత్ నరేష్, రజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ సంతానం కోసం వేచి చూడగా ఈనెల 3న మరో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ మద్యవర్తులు నీలగిరి స్వామి తాండాకు చెందిన భూక్యా, బౌన్ సింగ్ల ద్వారా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన ప్రవీణ్కు రూ.80 వేలకు అమ్మారు. పాపను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ డబ్బు మొత్తానికి ప్రామిసరీ నోటు రాయించి, పాపను అధికారికంగా దత్తత తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. విషయం కాస్తా తాండాలో బయటకు పొక్కడంతో మాలోత్ నరేష్ దంపతులను తాండావాసులు గట్టిగా నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
శిశు విక్రయం!
కౌడిపల్లి: నెలరోజుల ఆడశిశువు విక్రయం జరిగింది. గ్రామస్థులు మందలించడంతో ఆ తల్లిదండ్రులు తమ శిశువును ఇంటికి తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఆదివారం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా... కౌడిపల్లి మండలం బతుకమ్మ తండాకు చెందిన దెవాసోత్ గోప్య, నిర్మల దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంధ్య, కీర్తి ఉన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం సంక్రాంతి పండుగ రోజున నిర్మల మెదక్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో సుమారు రూ.25 వేలు ఖర్చయ్యింది. కాగా శనివారం కౌడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి తమ నెల రోజుల వయస్సున్న పసిపాపను విక్రయించారు. విషయం తండావాసులకు తెలిసి వారు మందలించడంతో తిరిగి ఆ చిన్నారిని ఆదివారం ఇంటికి తెచ్చుకున్నారు. ఈ విషయమై గోప్యను వివరణ కోరగా.. కూలీ పనులు చేసుకుని బతికే తమకు ఉన్న ఇద్దరూ భారమయ్యారు. మరో అమ్మాయిని పోషించే స్థోమత లేక శిశువును దత్తత ఇవ్వాలని చూశాను తప్ప విక్రయించలేదన్నారు. పేదరికమే కారణమా...? తండాల్లో శిశు విక్రయాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పేద కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలను విక్రయిస్తున్నారు. తాజాగా కౌడిపల్లి బతుకమ్మ తండాలో శిశు విక్రయం వెలుగు చూసింది. కూలి పనులు చేసుకునే గోప్య నెలరోజుల క్రితం పుట్టిన శిశువును పోషించే స్థోమత లేక బేరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈయన తన తండ్రి నుంచి రెండేళ్ల క్రితం వేరుపడ్డాడు. వాటా కింద కేవలం పదిగుంటల సాగుభూమిని మాత్రమే వచ్చింది. దీంతో సాగు పూర్తిస్థాయిలో చేయలేక కూలి పనులు చేసుకుంటున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో మూడో సంతానాన్ని విక్రయించాడు. స్థానికుల ఒత్తిడి భరించలేక ఎట్టకేలకు తిరిగి తెచ్చుకున్నాడు.