
మెదక్, సాక్షి: పోషించే స్థోమత లేకపోవడంతో ఒక గిరిజన మహిళ తన కన్నబిడ్డనే అమ్ముకున్న ఉదంతం మొదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిలిపిచెడ్ మండలంలోని బద్రియ తండాకు చెందిన లంగోత్ దుర్గా,సంగీతాలకు ఇద్దరు ఆడపిల్లలు.. మూడో కాన్పు కోసం మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల జన్మించడంతో ఆర్థికభారం భరించలేక ఆ బిడ్డను బుధవారం అమ్మకానికి పెట్టగా.. నాగమణి అనే ఆశా కార్యకర్త మధ్యవర్తిత్వం వహించింది.
రాధ అనే మహిళకు ఐదువేల రూపాయలకు శిశువును విక్రయించే విధంగా ఒప్పందం కుదిరింది. ఆసుపత్రిలో డెలివరీ చేసిన ఓ వైద్యుడు ఈ విషయాన్ని బయటకి తేవడంతో శిశువు విక్రయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు బిడ్డను కన్నతల్లికి అప్పగించగా.. మధ్యవర్తిత్వం వహించిన ఆశా కార్యకర్తపై కేసు నమోదు చేశారు. తనకు పిల్లలు కలగకపోవడంతోనే ఆడబిడ్డను కొనుగోలు చేసినట్లు రాధ చెబుతోంది. శిశువును అధికారులు కన్నతల్లి వద్దకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment