కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలు
కేఎంసీ, న్యూస్‌లైన్ : వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో అక్రమ నియామకాలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్లంబర్, టైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి ఆరు నెలల క్రితమే రూ. 4 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పేరుతో ప్రత్యేకంగా నోట్‌ఫైల్ (681-26.2.2013) తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా కలెక్టర్‌కు పంపించారు. నోట్‌ఫైల్‌ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా సోషల్వెల్ఫేర్ ఆఫీసర్, కేఎంసీ ప్రిన్సిపాల్‌తో కూడిన కమిటీని నియమించి నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మహిళకు టైలర్పోస్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి ప్లంబర్ పోస్టు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. టైలర్పోస్టు ఇవ్వనున్న మహిళ భర్త అదే ఆస్పత్రిలో పనిచేస్తుండడం గమనార్హం. నిజానికి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేసే జీఓ కాలపరిమితి జూన్‌లోనే పూర్తయింది.
రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం రెండు పోస్టుల కన్నా ఎక్కువగా ఉంటేనే బ్యాక్లాగ్ కిందికి వస్తాయి. ఒక పోస్టు ఉంటే జనరల్‌గా భర్తీయాలి. పోస్టులు భర్తీచేయాలని గతంలో లంబాడ హక్కుల పోరాటసమితి నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు లేవని 30-12-20011న ఫైల్ నంబర్ ఈ1-681 విడుదల చేసి వివరణ ఇచ్చారు. 12-01-2012 తేదీన తమ ఆస్పత్రిలో టైలర్, ప్లంబర్, రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్‌కు ఫైల్ పంపించారు.
20 రోజుల్లోనే ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు. దీంతో టైలర్ పోస్టు కోసం ఇంటర్వ్యూకు హాజరైన సౌజన్య అనే మహిళ కోర్టుకు వెళ్లింది. ట్రిబ్యునల్ నంబర్ (5874/2012)తో కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. అయితే ఈమెతో పాటు ఇంటర్వ్యూకు హాజరైన స్వరూప, పరంజ్యోతిని కాదని అర్హతలేని వేరే మహిళను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్లంబ ర్ పోస్టు కోసం ఇమ్మానియేల్, రాజు, నవీన్ హాజరయ్యారు. కాగా, అదే ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద డబ్బులు తీసుకుని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ నియామకం చెల్లదని గతంలోనే కోర్టు సైతం కొట్టివేసింది. నిజానికి ఐ ఆస్పత్రిలో ప్లంబర్, ఓ టైలర్ పోస్టు భర్తీకి 25-1-1990లో జీఓ 73 విడుదలైంది. తమకు అనుకూలమైన వారితో భర్తీచేయాలని అధికారులు 23 సంవత్సరాలుగా వేచిచూశారనే విమర్శలు వస్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయొద్దని నెల రోజుల కిత్రం డీఎంఈ నుంచి ప్రత్యేక జీఓ ఆస్పత్రికి జారీ అయింది.
గతంలో పనిచేసిన వారికి అన్యాయం..
నెల రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఆంకోను నియమించినట్లు తెలిసింది. గతంలో పనిచేసిన వారిని కాదని డబ్బులు వసూలు చేసి ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కంటి ఆస్పత్రిలో ప్రతి సంవత్సరం సుమారు 10 అక్రమ పోస్టులు నియామకం చేపడుతున్నారని గతంలో పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఎంఈ అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు, యూని యన్ నాయకులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే : పాండురంగజాదవ్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్
నింబంధనల ప్రకారమే నియామకాలు చేస్తున్నాం. కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పంపించాం. ఆయన అనుమతితోనే పోస్టుల భర్తీ ఉంటుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు.