ఇలా అయితే ప్రగతి ఎలా!
ఇందూరు: బీఆర్జీఎఫ్ 2014-15 సంవత్సరానికి సంబంధించిన పనుల ప్రతిపాద న ప్రణాళిక తీరు.‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి’ అన్నట్లుగా తయారైంది జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే ఈ నిధుల కో సం పనులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. నేటివరకు పంపిన దాఖలాలు లేవు.
దీనికి ప్రధాన కారణం మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ప్రతిపాదనలు సమయానికి జడ్పీ అధికారులకు అందకపోవడమే. 2014-15 సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 24 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులను కేంద్రం కేటాయించింది. పనుల ప్రతిపాదనలు పంపాలని రెండు నెలల క్రితమే జడ్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 25 వరకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ ఆదేశాలను జడ్పీ అధికారులు మండల, మున్సిపల్ అధికారులకు పంపారు.
స్సందించని అధికారులు
గడువు ముగిసినప్పటికీ, కొన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో మరో రెండు రోజులు గడువు పెంచిన అధికారులు, రోజూ వెంటపడి, ఒత్తిడి చేసి ప్రతిపాదనలను దాదాపు అన్ని మండలాల నుంచి తెప్పించుకున్నారు. బోధన్, కామారెడ్డి మున్సిపల్‌ల నుంచి కూడా ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు మాత్రం పంపలేదు. పలుసార్లు జడ్పీ సీఈఓనే కమిషనర్లకు ఫోన్ చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జూలై మొదటి వారం పూర్తి కావస్తున్నా, ఇంకా వారు ప్రతిపాదనలు ఇవ్వకపోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్జీఎఫ్ నిధులు కావాల వద్దా? వద్దంటే చెప్పండి అంటూ సీరియస్ అ య్యారు. రెండు గంటలలో పంపుతామని వారు సీఈఓకు తెలిపారు. నేటి వరకు కూడా పనుల ప్రతిపాదనలు పంపలేదు. కేంద్రం విధించిన గడువుతోపాటు, జడ్పీ అధికారులు విధించిన గడువు ముగిసి పది రోజులు దాటింది. రోజులవుతుంది. నిజామాబాద్, ఆర్మూర్ మున్సిపాల్టీల నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో కేంద్ర ప్రభు త్వానికి సరైన సమయంలో ప్రణాళికను పంపలేకపోయారు.
మళ్లీ మొదటికేనా?
ఈ నెల ఐదున జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరిగి, కొత్త పాలకవర్గం కొలువుదీరింది. బీఆర్జీఎఫ్ పనుల ప్రణాళిక తయారీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని 15 రోజుల క్రితం జడ్పీ సీఈఓ రాజారాంకు పలువురు జడ్పీటీసీలు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త పాలకవర్గం కొలువుదీరిన నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తయారు చేసిన పనుల ప్రణాళికపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకం టే పాలకవర్గ సభ్యులు బీఆర్జీఎఫ్ పనుల గుర్తింపుపై తమకూ అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జడ్పీ పాలకవర్గం సమావేశమై వారు ప్రత్యేకంగా తీర్మానం చే సుకునే అధికారం కూడా ఉంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు వచ్చిన పనుల ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు కానున్నాయి. మళ్లీ మొదటి నుంచి పనుల ప్రతిపాదనలు త యారు చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి సమర్పించే సరికి మరో నెల రోజుల సమయం పట్టవచ్చు.