ఆంధ్రా బ్యాంక్‌కు మొండిబకాయిల సెగ
ప్రొవిజనింగ్‌తో 72% క్షీణించిన లాభాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు మొండిబకాయిలు భారీగా పెరిగాయి. స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) 5.31 శాతం నుంచి 8.39 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 2.93 % నుంచి 4.61 శాతానికి పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 3.89%. మొండిబకాయిలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ భారీగా పెరగడంతో మార్చి త్రైమాసికంలో నికర లాభం 72 శాతం క్షీణించింది. బ్యాంకు శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 185 కోట్లుగా ఉన్న లాభం ఈసారి రూ. 52 కోట్లకు తగ్గింది.
ఆదాయం 9 % వృద్ధితో రూ. 4,699 కోట్ల నుంచి రూ. 5,124 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ రూ. 633 కోట్ల నుంచి రూ. 1,023 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్(నిమ్) 3.48%నుంచి తగ్గి 3.41%కి పరిమితమైంది. బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000కోట్ల లాభాలు సాధించాలని భావించినప్పటికీ.. అందులో సగానికే పరిమితమైంది. పూర్తి సంవత్సరానికి గాను.. కంపెనీ లాభాలు రూ. 638 కోట్ల నుంచి రూ. 540 కోట్లకు తగ్గాయి. ఆదాయం రూ. 17,868 కోట్ల నుంచి రూ. 19,199 కోట్లకు పెరిగింది. నిమ్ 3.18 శాతంగా నమోదైంది.
ఫిబ్రవరిలో బాండ్ల ద్వారా రూ. 800 కోట్లు బ్యాంకు సమీకరించింది. రూ. 136 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను ఎల్ఐసీకి కేటాయించింది. రూ. 378 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చినందుకు ప్రభుత్వానికి 49.46 కోట్ల షేర్లను కేటాయించింది. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా 61.02%నుంచి 61.26 %కి పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి షేరు ఒక్కింటిపై రూ. 0.50 డివిడెండు ప్రకటించింది.