bad effect
-
జంక్ ఫుడ్‌తో చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు
చేత్తో మనసారా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తే చాదస్తం అనుకుంటున్నారు. ఓ స్పూన్ చేత్తో పట్టుకుని నూడుల్స్ తింటే మావాడు ఎంత బాగా తింటున్నాడో అంటూ పిల్లల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇంట్లో చేసిన ఎంత కమ్మనిన వంటకమైనా మొహం తిప్పుకుంటారు. కానీ అష్టరోగాలు తెచ్చే జంక్‌ఫుడ్‌ను మాత్రం ఆవురావురుమంటూ తింటారు నేటి పిల్లలు. తిన్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే.. దాని అసలు పైత్యాన్ని చూపిస్తుంది. ఇందుకు ఈ ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యంగా నిలిచింది. జంక్‌ఫుడ్ తినే అలవాటుతో జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాలు.. లండన్ : ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలో ఓ యువకుడు ఏడేళ్ల వయసు నుంచి జంక్‌ఫుడ్ మాత్రమే తీసుకునేవాడు. పండ్లు, కూరగాయలు అస్సలు ముట్టుకునేవాడు కాదు. స్కూలుకు వెళ్లేప్పుడు తల్లి లంచ్ బాక్స్‌లో రోజూ పండ్లు, ఇతర పోషకాహార పదార్ధాలు పెట్టినా వాటిని ముట్టుకోక సాయంత్రం లంచ్ బాక్సును అలాగే తెచ్చేవాడు. రోజూ ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణం నుంచి చిప్స్, సాసర్, వైట్ బ్రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారంలను మాత్రమే తీసుకొని తింటుండడంతో పంతొమ్మిదేళ్లు వచ్చేసరికి అంధత్వం వచ్చింది. దాంతో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇటీవల ఆ యువకుడు పై చదువుల నిమిత్తం ఐటీ కోర్సులో చేరాడు. కానీ చూపు లేకపోవడం, చెవుడు వంటి సమస్యలతో ఆ కోర్సు నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతనికి సోదరి, సోదరుడు ఉన్నా వారు మంచి పోషకాహారం తీసుకోవడంతో వారికి ఎలాంటి సమస్య లేదు. చిన్నప్పటి నుంచీ సదరు యువకుడు సన్నగా ఉండడంతో తల్లి అతని బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ యువకుడు చాలా సన్నగా, ఒక రేకులా కనిపిస్తున్నాడు. డాక్టర్లు అతనిని పరిశీలించి కౌన్సిలింగ్లో భాగంగా సమతుల ఆహారం, పండ్ల రసాలు, విటమిన్ ట్యాబ్లెట్టు ఇస్తే వాటిని కొన్నిరోజులు వాడి మళ్లీ యథావిధిగా జంక్‌ఫుడ్ తీసుకునేవాడు. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఆ యువకుడి వయస్సు ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే. -
మొబైల్ ఫోన్లతో కొందరిపై దుష్ప్రభావం
మొబైల్ఫోన్ల నుంచి వెలువడే రేడియో ధార్మికత కౌమార వయస్కుల జ్ఞాపకశక్తిపై దుష్ప్రభావం చూపుతుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ దేశంలో దాదాపు 700 మంది కౌమార వయస్కులపై జరిగిన ఒక అధ్యయనం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్ ఆర్ స్లీ తెలిపారు. రేడియో తరంగాల ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత క్షేత్రం మెదడుకు దగ్గరగా ఉంచుకోవడం వల్ల ఇలా జరుగుతోందని ఆయన అన్నారు. కౌమార వయస్కులపై రేడియో ధార్మికత ప్రభావంపై ఇలాంటి శాస్త్రీయ పరిశోధన జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. మొబైల్ ఫోన్‌తో చేసే ఇతర పనులు అంటే.. మెసేజ్‌లు పంపడం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం వంటివాటితో పెద్దగా ఇబ్బంది లేదని.. కుడి చెవికి దగ్గరగా ఫోన్ పెట్టుకుని మాట్లాడటం మాత్రం వారిలో ఒకరకమైన జ్ఞాపకశక్తి (ఫిగరల్ మెమరీ) తగ్గేందుకు కారణమవుతోందని చెప్పారు. ఏవైనా ఇతర కారణాల వల్ల ఇలా జరుగుతోందా? అన్నది తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఒక అధ్యయనం కూడా మొబైల్ఫోన్ల వాడకం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. -
వ్యర్థాలతో చేపల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
కైకలూరు : చేపల సాగులో మేతగా వ్యర్థాలను వినియోగించే రైతులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు అన్నారు. స్థానిక బృందావన్ లాడ్జిలో సంఘ నాయకులు, చేపల రైతులతో కలసి ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల సాగు కారణంగా మొత్తం చేపల పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందన్నారు. ఫంగాసీస్ చేపల సాగులో వ్యర్థాలను కొందరు రైతులు వాడుతున్నారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. వ్యర్థాలతో సాగు చేస్తే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమీప రైతులు వ్యర్థాలతో మార్కెట్లో జరిగే నష్టాలను వివరించాలన్నారు. చేపల చెరువుల లైసెన్సులు నిమ్తితం రూ.700లతోపాటు ఆటో క్వాడ్ చెల్లించినవారికి అనుమతులు రాకపోతే గుడివాడ రోడ్‌లోని సంఘ కార్యాలయంలో వివరాలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సెక్రటరీ చింతపల్లి అంకినీడు, కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి అప్పారావు, భాస్కరవర్మ, ఘంటా సత్యనారాయణ, పాలచర్ల శ్రీనివాసచౌదరీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.