bad name
-
గాడి తప్పిన ఖాకీలు
– సెటిల్మెంట్లతో డిపార్ట్మెంట్కు చెడ్డపేరు - సంపాదన కోసం అధికార పార్టీ నేతతలతో కలిసి అడ్డదారులు – నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ అనంతపురం సెంట్రల్ : శాంతిభద్రతలు కాపాడాల్సిన ఖాకీలు సెటిల్మెంట్లతో కొంతమంది బిజీగా గడుపుతున్నారు. సామాన్యులపై కర్రపెత్తనం చేస్తూ పోలీసుశాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. ఏడాది కాలంలో అనేక ఘటనలు పోలీసుశాఖకు మాయని మచ్చలు మారాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ జరిగని విధంగా ఓ సీఐపైనే కేసు నమోదు చేయాల్సి వచ్చింది. నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయనైనా పోలీసు శాఖను ప్రక్షాళన చేసి.. గాడిలో పెడతారా అన్నది వేచి చూడాలి. అధికార పార్టీ నేతలతో దోస్తీ.. జిల్లాలో కొంతమంది పోలీసులు అధికారపార్టీ నేతలతో దోస్తీ చేస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. ఎక్కువశాతం రెవెన్యూ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల సీఐపై కేసు నమోదు చేయడానికి కారణం కూడా ఇదే. అధికారపార్టీ నేతతో కలిసి నగరశివారులోని విలువైన 8 ఎకరాల స్థలాన్ని తన పేరిట రాయించుకున్నారనేది ప్రధాన అభియోగం. దీనిపై విచారించిన ఉన్నతాధికారులు ఏకంగా సీఐపైనే కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనే నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కూడా జరిగింది. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడి కన్నుపడిన స్థలం కోసం ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, బెదిరించారని అభియోగాలు రావడంతో నాల్గవ పట్టణ సీఐను వీఆర్‌కు పంపి, ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనలు మచ్చుకు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సివిల్ పంచాయితీల్లో తలదూర్చి డిపార్ట్మెంట్కు చెడ్డపేరు తెచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో రూ. లక్షలు దారి మళ్లించారనే అభియోగాలు కూడా పోలీసు శాఖపై వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు సీఐలు, ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతస్థాయిలో విచారణ జరగుతున్నట్లు సమాచారం. ఇలా డబ్బు సంపాదన కోసం కొంతమంది పోలీసు అధికారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. మితిమీరిన రాజకీయజోక్యం పోలీసుశాఖలో ఉద్యోగుల నియామకాల్లో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఎమ్మెల్యే ఏ సామాజికవర్గం అయితే ఆ నియోజకవర్గంలో అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీశాతం వారే ఉండడం గమనార్హం. తాడిపత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే రెడ్ల సామాజిక వర్గం కావడంతో అక్కడంతా ఎక్కువగా ఆ సామాజిక వర్గ ఉద్యోగులే ఉంటున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గౌడ సామాజిక వర్గం కావడంతో అక్కడంతా గౌడ ఉద్యోగులే పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. తమ నియోజకవర్గంలో హోంగార్డు నుంచి సీఐ వరకు ఎవరుండాలో అధికారపార్టీ నేతలే నిర్ణయిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే పోలీసుశాఖలో రాజకీయజోక్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఎమ్మెల్యే సిఫార్సు లేనిదే ఇతరులకు పోస్టింగ్‌లు ఇచ్చే పరిస్థితి లేదు. వారు కూడా వారి సామాజికవర్గ అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికారపార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పోలీసు పాలన సాగుతోంది. జిల్లాలో ఇలాంటి పరిస్థితి పోయి సామాన్యులకు సైతం న్యాయం దక్కేలా చర్యలు తీసుకోవాలని నూతన పోలీసుబాస్‌కు జిల్లా ప్రజానీకం విజ్ఞప్తి చేస్తోంది. -
ఒంగోలు వల్ల జిల్లా మొత్తానికి చెడ్డపేరు వస్తోంది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలు నగరంలో ఓటు హక్కుకు సంబంధించి పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో జిల్లా మొత్తానికి చెడ్డపేరు వ స్తోందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఒంగోలు ఆర్డీఓను ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా అబ్జర్వర్ మధుసూదనరావుతో కలిసి నియోజకవర్గస్థాయి అధికారులు, తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రతిరోజూ తనకు ఎస్ఎంఎస్ రూపంలో నివేదికలు అందించాలని ఆదేశించారు. ఏబీసీడీలు కూడా నొక్కలేరా.. ‘ప్రతి తహసీల్దార్‌కు డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చాం. కీలకమైన ఆ సిగ్నేచర్‌ను ఆపరేట్ చేయలేకపోతున్నారు. ఏబీసీడీ అనే లెటర్స్ కూడా కొట్టలేకపోతున్నారు. పైగా కంఫ్యూటర్ ఆపరేటర్‌కు వాటిని ఇస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే మిమ్మల్ని బయటకు పంపించి కంప్యూటర్ ఆపరేటర్లను తహసీల్దార్లుగా చేయాల్సి వస్తుందేమోనని’ కలెక్టర్ వ్యాఖ్యానించారు. మార్కాపురం ఆర్డీఓను అడిగితే తహసీల్దార్ పేరు చెప్పడం, తహసీల్దార్ అడిగితే కంప్యూటర్ ఆపరేటర్ పేరు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. జిల్లాలో చేతగానివారు, పనికిమాలినవాళ్లు ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు పనిచేస్తూ కూడా ఎందుకు అనిపించుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఓటర్ల దరఖాస్తులు ప్రతిరోజూ అప్లోడ్ చేయాలి: రోల్ అబ్జర్వర్ ఓటర్లను విచారించిన అనంతరం ఆ దరఖాస్తులను ఏరోజుకారోజు అప్లోడ్ చేయాలని రోల్ అబ్జర్వర్ మధుసూదనరావు ఆదేశించారు. ఒంగోలులో ఓటర్ల నమోదుకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని సకాలంలో విచారణ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు లేకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.