అఫ్ఘాన్ మృతులు 500!
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్లోని బదక్షాన్ రాష్ట్రం ఆబ్ బరీక్ గ్రామంపై శుక్రవారం భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన లో మృతుల సంఖ్య 500కు పెరగొచ్చని అధికారులు చెప్పారు. శనివారం నాటికి 300 మంది మృతిచెందినట్లు ధ్రువీకరించామన్నారు. ఈ విపత్తులో 2,500 మంది మృతిచెందారని అంతకు ముందు ప్రకటించారు. అయితే సాంకేతిక బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా కాకుండా స్థానికులు ఇచ్చిన సమాచారాన్నిబట్టి అలా ప్రకటించినట్లు వివరణ ఇచ్చారు. మృతుల సంఖ్య 500 దాటకపోవచ్చన్నారు. 300కుపైగా ఇళ్లు కొన్ని మీటర్ల ఎత్తు బురదలో కూరుకుని పోవడంతో సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. ఈ విపత్తుపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సాయం చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.