పార్కులో రికార్డయిన షాకింగ్ వీడియో
బీజింగ్: వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఫ్యామిలీతో కలిసి పార్క్ కు వెళ్లిన మహిళ.. అనూహ్యంగా పులికి ఆహారమైంది. ఆ పాశవికదాడికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా రాజధాని బీజింగ్ నగరంలోగల బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్కులో.. సందర్శకులు తమ సొంత కార్లలో సఫారీకి వెళ్లే వీలుంది. కారులో కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకున్న యువతి.. అలిగి కారు దిగింది. మరో వైపు నుంచి మళ్లీ కారు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా ఓ పులి ఒక్కసారిగా దాడిచేసింది. బలమైన పంజాతో యువతిని లాక్కుపోయింది. కారులో ఉన్న వ్యక్తి, మరో మహిళ పులిని వెంబడించి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన్ లోకి ఎంటర్ అయిన మరో పులి.. సాయం చేసేందుకు వచ్చిన రెండో మహిళపై దాడిచేసి చంపేసింది.
పార్క్ సిబ్బంది పరుగున వచ్చి అదిలించడంతో పులులు పారిపోయాయి. కాగా, మొదట దాడికి గురైన యువతి గాయలతో బయటపడింది. పురుషుడికి గాయాలుకాలేదు. కారులో ఉన్న మరో చిన్నారి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. పులల దాడితో ఒక్కసారిగా పార్క్ ఆవరణమంతా వణికిపోయింది. అధికారులు పార్క్ ను తాత్కాలికంగా మూసేశారు. 2014లోనూ బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఇలాంటి సంఘటన జరిగింది.