భద్రాచలం సబ్ కలెక్టర్ గుప్తా బదిలీ
భద్రాచలం, న్యూస్‌లైన్ :
భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గుప్తా భద్రాచలం సబ్ కలెక్టర్‌గా గత ఏడాది ఆగస్టు 28న బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది ముక్కోటి ఉత్సవాలు, అదే విధంగా ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. రెవెన్యూ పాలన ను గాడిలో పెట్టే క్రమంలో తన కార్యాలయంలో డ్రస్ కోడ్‌ను అమలు చేయించారు. జిల్లాలో డ్రస్కోడ్ అమలు అనేది భద్రాచలంలోనే ప్రథమం కావటం గమనార్హం. విధుల్లో చేరిన మొదట్లో రెవెన్యూ యంత్రాంగానికి ముచ్చెమటలు పట్టించారు. అదే విధంగా గిరిజన సహకార సంస్థకు చెందిన డీఆర్‌డిపోలు, సివిల్ సప్లైకు చెందిన రేషన్ దుకాణాలను తనిఖీ చేసి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
ఐఏఎస్ స్థాయి అధికారి హోదాలో ఇలా రేషన్ దుకాణాలను తనిఖీ చేయటం ద్వారా నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా తగు చర్యలు తీసుకున్నారు. అయితే ఇసుక రీచ్‌ల నిర్వహణలో తలెత్తిన లోపాలు సబ్‌కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు మచ్చతెచ్చిపెట్టాయి. అదే విధంగా 1/70 చట్టాన్ని పరిరక్షించటంలో కూడా ఆయన ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలను మూటగట్టుకున్నారు. కాగా, ఈయన స్థానంలో భద్రాచలం సబ్ కలెక్టర్‌గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే ఆర్డీవో స్థాయి అధికారిని మళ్లీ ఇక్కడ నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఉంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఆర్డీవో స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన నేత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.