‘బడి దూరమవుతోంది’..పో
రాయవరం :‘ఊళ్లోనే ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఏడో తరగతి పూర్తయ్యే వరకూ బిడ్డలు పొరుగూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన బాధ ఉండదు’ అనుకున్న పలువురు తల్లిదండ్రుల నిశ్చింతకు తెరపడనుంది. జిల్లాలో 43 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని ప్రాథమిక పాఠశాలకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (ఆర్సీ నం:36) జారీ చేసింది. ఆరు, ఏడు తరగతుల్లో తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బడి ఈడు వచ్చినాచదువుకు దూరంగా ఉంటున్న బాలల కోసం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వమే..
పలువురు బాలలకు అకస్మాత్తుగా చదివే బడిని దూరం చేస్తూ.. ‘బడి పొమ్మంటోంది’ అన్న బాపతు నిర్ణయం తీసుకోవడాన్ని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి.ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉన్న వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలు (యూపీ స్కూళ్లు)గా పరిగణిస్తారు. జిల్లాలో 174 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని పెంచుతూ వాటిలో ఎనిమిదో తరగతిని ప్రవేశ పెడుతూ ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. (ఆ పాఠశాలలకు ఒక్క పోస్టును కూడా మంజూరు చేయక పోవడం గమనార్హం.)
20 లోపు విద్యార్థులుంటే 6, 7 తరగతులకు ఎసరు
అయితే ఇంతలోనే.. ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు 20 లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని కుదించి, ఆరు, ఏడు తరగతులను సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. వాటి ప్రకారం జిల్లా ఆరు, ఏడు తరగతుల్లో 20 లోపు విద్యార్థులున్న 43 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆ తరగతులను దగ్గరలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్లను కూడా సమీపంలోని ఉన్నత పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఆ రెండు తరగతుల విలీనం అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా మారనున్నాయి. ఆరు, ఏడు తరగతులోల 20 లోపు విద్యార్థులున్నా.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేక పోతే అలాంటి పాఠశాలలను ప్రస్తుతానికి ప్రాథమికోన్నత పాఠశాలలుగానే ఉంచుతారు.
జిల్లాలో 28 మండలాల్లో 43 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులు సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. అయినవిల్లి, ఆలమూరు, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, గోకవరం, కడియం, కాజులూరు, కోటనందూరు, మలికిపురం, పి.గన్నవరం, రాజమండ్రి అర్బన్, రంపచోడవరం, రావులపాలెం, రాయవరం, తాళ్లరేవు, యు.కొత్తపల్లి మండలాల్లో ఒక్కో ప్రాథమికోన్నత పాఠశాల, గొల్లప్రోలు, ఐ.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, సఖినేటిపల్లి, తొండంగి, ఉప్పలగుప్తం మండలాల్లో రెండేసి, దేవీపట్నం మండలంలో మూడు, ముమ్మిడివరం మండలంలో ఐదు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య క్షీణిస్తుంది..
విద్యార్థులు లేరనే సాకుతో ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించడం ఎంతవరకు సబబని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించక పోతే విద్యార్థులు ఎలా చేరతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు ఉన్న కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు లంక ప్రాంతాల్లో ఉన్నాయని, అలాంటి వాటి నుంచి ఆరు, ఏడు తరగతులను తొలగిస్తే పలువురు విద్యార్థులు నదులు దాటి పాఠశాలలకు వెళ్లకుండా.. అయిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పే అవకాశం ఉందని విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయం వలన ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడంతో పాటు రాబోయే డీఎస్సీలో పోస్టులు కూడా తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.