నా కంటే గొప్పగా ఎవరూ నటించలేరు
ముంబై: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రామ్ లఖన్ సినిమాలో నటించడం ద్వారా వెలుగులోకి వచ్చిన వెటరన్ గుల్షన్ గ్రోవర్.. ఈ సినిమాలో తన పాత్రను తన కంటే గొప్పగా ఎవరూ చేయలేరని అన్నాడు. 1989లో విడుదలైన ఈ సినిమాలో కేసరియా విలాయతిగా నటించిన గ్రోవర్ బ్యాడ్ మన్‌గా పాపులర్ అయ్యాడు.
సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో స్వయంగా నిర్మించిన రామ్ లఖన్ సినిమాలో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాఖీ, మాధురి దీక్షిత్, డింపుల్ కపాడియా, గుల్షన్ గ్రోవర్, అమ్రిష్ పురి, పరేష్ రావెల్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. కాగా ఈ సినిమాను యువ హీరోలు షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లతో రీమేక్ చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో గ్రోవర్ స్పందించాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టిన గ్రోవర్.. అది అద్భుతమైన పాత్రని అన్నాడు. రీమేక్‌లో మీ ప్రాతకు ఎవరైతే న్యాయం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. తన పాత్రలో తనకంటే బాగా మరొకరు నటిస్తారని భావించడం లేదని చెప్పాడు. ఒక్కరు మాత్రమే బ్యాడ్మన్ పాత్రను చేయగలరని, ఆ వ్యక్తి తానేనని అన్నాడు.