మరిన్ని విజయాలు సాధిస్తా: సింధు
బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం
* కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా
* నగదు ప్రోత్సాహకాలు అందజేత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించినప్పటికీ... ఇప్పట్లో తనకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదని... భవిష్యత్‌లో దేశానికి మరిన్ని విజయాలు, పతకాలు అందించాలనే లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల ఈ తెలుగు తేజం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం తన కోచ్ పుల్లెల గోపీచంద్, తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో కలిసి విజయవాడకు వచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం, ఇంత మంది నాకోసం వస్తారని ఎన్నడూ ఊహించలేదు. మా తాతగారిది ఈ ఊరే. చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారీ అప్పట్లో గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూశాను. ఆయన ఆటతో స్ఫూర్తి పొందాను. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి మీ ప్రార్థనలు, కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులే ప్రధాన కారణం’ అని సింధు వ్యాఖ్యానించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింధు కలిసి కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం సింధుతోపాటు గోపీచంద్, శ్రీకాంత్, చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికైన మాజీ అథ్లెట్ సత్తి గీతను సన్మానించారు.
అనంతరం రాత్రి కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవంలో పాల్గొన్న సింధు, గోపీచంద్‌లతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్‌లకు చంద్రబాబు చెక్‌లు అందజేశారు. సింధుకు రూ. 3 కోట్లు... వెయ్యి గజాల స్థలం పత్రాలు... గోపీచంద్‌కు రూ. 50 లక్షలు... శ్రీకాంత్‌కు రూ. 25 లక్షలు అందజేశారు.
ఏసీఏ నజరానా రూ. 25 లక్షలు...
రజత పతక విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నజరానా ప్రకటించింది. సింధు కు రూ.25 లక్షలు... కోచ్ గోపీచంద్‌కు రూ. 10 లక్షలు నజరానా ప్రకటించింది. ఏసీఏ తరఫున వీరిద్దరికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు చెక్‌లు అందజేశారు. అంతకుముందు సింధును, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలను ఆంధ్రప్రదేశ్ క్రీడా సంఘాలు భారీ గజమాలతో సన్మానించాయి.
సింధును ఆదర్శంగా తీసుకోవాలి....
క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటార నడానికి సింధునే ఆదర్శమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్థానిక విజయవాడ క్లబ్లో క్లబ్ ఆధ్వర్యంలో సింధును మంగళవారం ఘనంగా సన్మానించారు. సింధు దేశానికే గర్వకారణమన్నారు. సింధుతోపాటు ఆమె కోచ్ గోపీచంద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, క్లబ్ ప్రతినిధులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
రూ. 50 లక్షల విలువ చేసే స్థలం...: ఫ్యూచరాల్ హోమ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సింధుకు రూ. 50 లక్షలు విలువచేసే స్థలాన్ని బహూకరించింది. విజయవాడ క్లబ్లో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో సంస్థ ఎండీ చింతా రవికుమార్ స్థల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.
మల్లీశ్వరి సన్మానంతో స్ఫూర్తి పొందా: కోచ్ గోపీచంద్
సిడ్నీ ఒలింపిక్స్‌లో (2000లో) ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించినప్పుడు ఆనాడు ప్రభుత్వం చేసిన సన్మానంతోనే తాను స్ఫూర్తి పొందినట్లు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు విజయోత్సవ సభలో గోపీచంద్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆనాడు కరణం మల్లీశ్వరికి ఎల్బీ స్టేడియంలో చేసిన సన్మాన కార్యక్రమంలో గ్యాలరీలో ఒకరిగా కూర్చొన్నానని తెలిపాడు. తాను కూడా ఎప్పటికైనా ఇలాంటి సన్మానం చేయించుకోవాలని కలలు కన్నట్లు తెలిపాడు. ఆ కలను సాకారం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో చాంపియన్‌గా నిలిచాక సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకున్నాను. అలాగే ఈ సన్మాన కార్యక్రమం ఎందరికో స్ఫూర్తిగా నిలవాలన్నాడు. సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో ఆమెతోపాటు తనకు కూడా సన్మానం చేయడం గర్వంగా అనిపిస్తోందన్నాడు.