భద్రాద్రి రాముడు మావాడే
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : భద్రాద్రి రాముడ్ని ఉభయ గోదావరి జిల్లాలనుంచి ఎవరూ విడదీయలే రని, భద్రాచలం సీమాంధ్రలో అంతర్భాగమని నినదిస్తు గిరిజన పూజారులు, గోదావరి విద్యార్థి సమాఖ్య, భార్గవ సేన, ఆర్య వైశ్య సంఘాల ప్రతినిధులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన సీమాంధ్ర సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా జరిగింది. పవనగిరి స్వామి తణుకు వెంకటరామయ్య గురూజీ ఆధ్వర్యంలో అడ్డతీగల నుంచి వచ్చిన గిరిజనులు, గిరిజన అర్చకులు పాల్గొన్నారు. సీమాంధ్ర సంఘర్షణ సమితి అధ్యక్షుడు పి. రాంబాబు, ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, రామాలయాల కన్వీనర్ డాక్టర్ అనసూరి పద్మలత నాయకత్వం వహించారు.
ఆర్యవైశ్య ప్రముఖులు వెత్సా బాబ్జి, మైలవరపు నాగేంద్రప్రసాద్ గోదావరి విద్యార్ధి సమాఖ్య కన్వీనర్ సంజీవ రావు, ఎన్జీఓ నాయకులు శాంతకుమార్, వేణుమాధవ్ తదితరులు ఆందోళనలో పాల్గొని ఆర్డీఓ ఎం.వేణు గోపాలరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. శ్రీరాముడు ఉభయగోదావరి సంస్కృతిలో అంతర్భాగమని వారన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ రేలా నృత్యం ప్రదర్శించారు. గోదావరి ప్రాంత రైతాంగం, ఉభయ గోదావరి జిల్లాల్లోని రామాలయాల నిర్వాహకులు, గిరిజనులతో కలసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని సమితి నాయకులు తెలిపారు. తెలంగాణకు భద్రాద్రి రాముడితో ఎలాంటి సంబంధాలు లేవని వారన్నారు. భద్రాచలం సీమాంధ్రలో లేకపోతే గోదావరి ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు.