badugulu
-
సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: బడుగులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే ఇకపై ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు. అసైన్డ్ భూములంటే పప్పు బెల్లాలు ఇచ్చి గుంజుకోవడం తమ హక్కుగా వ్యవహరించిన గత పాలకులకు భిన్నంగా పేదలకు భరోసా కల్పిస్తూ కొత్త ఒరవడి సృష్టించారు. జాతీయ చట్టం కంటే అధికంగా... జాతీయ భూ సేకరణ చట్టం–2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన జాతీయ భూసేకరణ చట్టం నిర్దేశిస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం విశేషం. వైఎస్సార్ స్ఫూర్తితో.. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో నిర్ణయించారు. ఆ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని 2013లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ భూసేకరణ చట్టం’ చేసింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే తొలిసారిగా రైత్వారీ భూముల కంటే అసైన్డ్ భూములకు 10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలను దగా చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను మోసగించడంలో చంద్రబాబు సర్కారు సరికొత్త విధానాలను అనుసరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారు. 2014లో మళ్లీ సీఎం అయ్యాక మరో ఎత్తుగడ వేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాల్సి ఉండగా అందుకు సమ్మతించని చంద్రబాబు రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ విధానం అమలు చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెబుతూ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ ప్రతిఫలం ఇచ్చారు. పూలింగ్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసగించారిలా ► రైత్వారీ పట్టాలున్న మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలంతోపాటు 250 గజాల వాణిజ్య స్థలం ప్రకటించారు. ► రైత్వారీ పట్టాలున్న జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలంతోపాటు 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. ► కానీ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు మాత్రం మెట్టకు ఎకరాకు కేవలం 800 గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలాన్ని మాత్రమే ప్రకటించారు. జరీబు భూమికి ఎకరాకు 800 గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. రైత్వారీ పట్టాల కంటే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు తక్కువ పరిహారం ఇచ్చి మోసం చేశారు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీల నుంచి దాదాపు 5 వేల ఎకరాలను తీసుకున్నారు. అసైన్డ్ భూములు అక్రమంగా టీడీపీ నేతల పరం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే అప్పటి సీఎం చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు ఉప్పందించారు. దీంతో దళితులను భయపెట్టి వారి నుంచి అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం ఆ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. భూ సమీకరణ కింద అసైన్డ్ రికార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకే పరిహారం చెల్లించాలి. అయితే చంద్రబాబు సర్కారు ఆ అక్రమ కొనుగోళ్లను గుర్తిస్తూ జీవో 41 జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ జీవోను రద్దు చేశారు. బడుగుల పక్షపాతి సీఎం జగన్ – కల్లూరి చెంగయ్య, ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు ‘బడుగులు, పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిరూపించుకున్నారు. అసైన్డ్ భూములకు 10 శాతం అదనపు పరిహారం చెల్లించాలన్న నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయం’ చరిత్రాత్మక నిర్ణయం.. – జలుమూరు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి ‘ఎస్సీలు, ఎస్టీలు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. నామమాత్రపు పరిహారంతో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను గుంజుకుంది. సీఎం జగన్ దళితులు, గిరిజనులకు అండగా నిలుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు’ చంద్రబాబు దగా చేశారు... – పులి ప్రభుదాస్, అసైన్డ్ రైతు, వెంకటపాలెం, అమరావతి ‘రాజధాని భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను దగా చేశారు. 1977 అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములను గుర్తిస్తూ అధికారంలో ఉండగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు రక్షణ కల్పించారు. భూ సేకరణ కింద తీసుకోవాల్సి వస్తే రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోంది’ చదవండి: ఇళ్ల నిర్మాణంతో ఎకానమీకి బూస్ట్.. -
కట్టేనా..ఎగ్గొట్టేనా !
తెనాలి అర్బన్ : ఇందిరమ్మ గృహ నిర్మాణానికి గ్రహణం పట్టింది. నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయా యి. ముందస్తు పెట్టుబడి పెట్టి నిర్మాణాన్ని చేపట్టిన బడుగులు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయో రావో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం ఉండాలన్న సదాశయంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకున్నారు. గృహ నిర్మాణానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ లబ్ధిదారులకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, పట్టణ ప్రాంతంలోని ఓసీ, బీసీలకు రూ.80 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఓసీ, బీసీలకు రూ.70వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. వైఎస్సార్ మరణం తరువాత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. అరకొరగా నిధులు మంజూరు చేసి, చేతులు దులుపుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదల అభ్యున్నతి పేరిట ఎన్నో ప్రకటనలు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వారి గురించి ఆలోచించే తీరికలేనట్టుగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హయాంలో మూడవ విడత రచ్చబండలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేసింది. లబ్ధిదారులు గృహ నిర్మాణాలను చేపట్టారు. ఈలోగా ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల గృహ నిర్మాణానికి పైసా కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. గృహ నిర్మాణ సంస్థ చెల్లింపులకు సంబంధించిన వెబ్సైట్ కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో వ్యయప్రయాసలకోర్చి గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. బిల్లులు చెల్లిస్తారన్న నమ్మకం కూడా రోజురోజుకూ వారిలో సన్నగిల్లి పోతోంది. మరోవైపు జియో ట్యాగింగ్.... గృహ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లో అవకతవకలను నిరోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫొటో ప్రక్రియ జియో ట్యాగింగ్. ఈ విధానం ద్వారా ఇంటి ఫొటోను ఆన్లైన్లో ఉంచితే, ఒకసారి బిల్లులు చెల్లింపులు పూర్తయిన ఇంటికి, మరోసారి చెల్లించే అవకాశం ఉండదు. మొదటి విడతలో నిర్మించిన ఇళ్లకు జియో ట్యాగింగ్ అమలు చేసే ప్రక్రియలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారులు బిల్లుల చెల్లింపుపై ప్రశ్నిస్తే అధికారులు దీనిని సాకుగా చూపి తప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వడ్డీలు కట్టలేక.. అమరావతి : ఇందిరమ్మ ఇళ్లకు ఏడాదిన్నరగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు బిల్లులు చెల్లిస్తారో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఇందిరమ్మ పథకం కింద మొత్తం 5,631ఇళ్లు మంజూరయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదటి విడతలో 1563, రెండవ విడతలో 1820, మూడవ విడతలో 1200 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 4,307 నిర్మాణాలు పూర్తి చేసి 1,406 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. మిగిలిన 1324 మంది లబ్ధిదారుల్లో 506 మంది నిర్మాణమే ప్రారంభించలేదు. మరో 195 మందికి ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. మరికొన్ని పునాదుల దశలోనూ, శ్లాబు దశల్లో నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ... ఎన్నికల తరువాత రాష్ర్ట వ్యాప్తంగా గృహ నిర్మాణాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను సైతం మూసివేశారు. ఈ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా రూ.100కోట్ల పైమాటే. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 60 గృహాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రం విడిపోయినా గృహనిర్మాణ సంస్థ విడిపోలేదు. నెల రోజుల్లోగా విడిపోయే పరిస్థితి ఉంది. ఆ తరువాతే ఈ బిల్లుల చెల్లింపునకు మోక్షం కలిగే అవకాశం ఉంది. - కేఎస్ ప్రకాశరావు, డీఈ, హౌసింగ్, తెనాలి -
బడుగులకు భరోసా
అది కడప నగరంలోని ఫరిడానగర్. వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులు. మురికి కాలువలతో సహ వాసం చేస్తున్న బడుగులు. స్థానిక పరిశ్రమల్లో దినసరి కూలీలుగా కొందరు, భవన నిర్మాణ కార్మికులుగా మరి కొందరు బతుకులు వెళ్లదీస్తున్నారు. మనిషిలో సత్తువ ఉన్నంత వరకు శ్రమనే నమ్ముకుని జీవించే వారికి పింఛన్ ఊతంగా ఉండేది. మలి సంధ్యలో ఆసరాగా ఉండేది. ఏడెనిమిదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వారిని జాబితా నుంచి తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 2.46లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతుంటే అందులో సుమారు 50వేల మందికి పైగా కోత విధిం చారు. ఒక్క కడపలోనే 7900 మందికి పింఛన్లు రద్దు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వయస్సు మళ్లిన వృద్ధులు, ఆసరాలేని వితంతువులకు ఆవేదన మిగుల్చుతోంది. జీవితంలో అండగా నిలుస్తున్న పింఛన్ కోసం ఆరాటపడుతున్న బడుగులను పలకరించేందుకు కడప మేయర్ కె సురేష్‌బాబు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. బాధితులను స్వయంగా పలకరించి వారి ఆవేదనను తెలుసుకున్నారు. చిన్నచౌక్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు పంచాయితీ మొత్తానికి కేవలం 421 పింఛన్లు మాత్రమే అందేవి. నెలకు రూ.75 చొప్పున మూన్నెళ్లకు ఒక్కసారి నిర్వహించే జన్మభూమిలో రూ.225 ఇచ్చేవారు. ఎనిమిది పంచాయితీలు కడప మున్సిపాలిటీలో విలీనం అయ్యాక కడప కార్పొరేషన్ పరిధిలో మొత్తం 6వేల మందికి పింఛన్లు అందేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక, కుల, మత, వర్గాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇచ్చారు. కార్పొరేషన్లో 18,900 మందికి నెలకు రూ.200 చొప్పున క్రమం తప్పకుండా ప్రతినెలా పింఛన్ అందేది. ఉద్యోగులకు జీతం అం దినట్లుగా 1నే పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులకు ఊతకర్రగా, వితంతువులకు ఆసరాగా, చేనేతలకు వెన్నుదన్నుగా ఆ పింఛన్లు నిలిచేవి. టీడీ పీ అధికారంలోకి వచ్చాక అడ్డదిడ్డంగా పిం ఛన్లు తొలగిస్తున్నారు. ఒక్క నగరంలోనే 7,900 పింఛన్లు తొల గించారు. అదేమం టే 5ఎకరాల భూమి ఉందంటారు. ఉండేందుకు ఇళ్లు కూడా లేని నిరుపేదలకు భూమి ఎక్కడిది.. కడప నగరంలో ఐదు ఎకరాల భూమి ఉంటే పింఛన్ తీసుకునే అగత్యం ఎం దుకు ఉంటుంది.. రేషన్ , ఆధార్ కార్డులలో వయస్సు తేడా ఉందని వితంతువులకు సైతం పింఛన్లు తొలగిస్తున్నారు. వయస్సు తేడా ఉన్నంత మాత్రన వారు వితంతువులు కారా.. ప్రభుత్వం పూర్తిగా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోంది.వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఆసరా కోల్పోయిన వితంతువులకు అన్యాయం చేశారు. అర్హులందరికీ వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలి. మేయర్: ఏం పెద్దాయనా.. బాగున్నావా? హుస్సేనప్ప: ఏదో ఇట్టా ఉండా సారూ.. మేయర్: ఏమైంది..పింఛన్ రావడం లేదా? హుస్సేనప్ప: రావడం లేదు సార్.. మేయర్: ఎందుకు రాలేదు? హుస్సేనప్ప: ఐదెకరాల భూమి ఉందని తీసేశారంట..నాకు ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేదు మీరే చూడండయ్యా... మేయర్: నిజమే..ఈ పెంకుటింట్లో ఎంతమంది ఉంటున్నారు ? హుస్సేనప్ప: ఐదుగురం ఉంటాం సార్, నా కొడుకు కష్టంపై మేమంతా బతుకుతున్నాం. పింఛన్ వస్తుంటే నేను భారం కాకుండా ఉండేది. మేయర్: ఏమవ్వా.. నీపేరేమి? వృద్ధురాలు: చౌడమ్మ నాయనా మేయర్: నీకు పింఛన్ వస్తుందా? వృద్ధురాలు: ఏడేళ్లుగా పింఛన్ వస్తూ ఉండేది. మూడునెలలుగా రావడం లేదు మేయర్: ఎందుకు రావడంలేదు? వృద్ధురాలు: ఎందుకో తెలియదు.. ఇంతకాలం ఇస్తున్న పింఛన్‌ను ఇప్పుడు ఎందుకు ఇవ్వరు. మేయర్: ఏమ్మా ఎలా ఉన్నావు? నారాయణమ్మ: బాగుండా సార్, నాకు కూడా పింఛన్ రాలేదు సార్.. మేయర్: ఎందుకు అని అడగలేదా..! నారాయణమ్మ: ఆధార్ కార్డులో తప్పు ఉందంటా, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, ఐదేళ్లనుంచి పింఛన్ తీసుకుంటున్నా, ఇప్పుడు రాదుపో అంటున్నారు సార్.. మేయర్: మీకందరికీ న్యాయం జరిగేలా చేద్దాం లేమ్మా. మేయర్: నీ పేరేమిటి తల్లీ ? బాధితురాలు: సుబ్బలక్షుమ్మ సార్ మేయర్: నీ సమస్య ఏంటి? బాధితురాలు: నాకు భర్త లేడు సార్, ఆధార్ కార్డులో తప్పు ఉందని పింఛన్ తొలగించారు. రూ. 200 పింఛన్ ఇస్తున్నప్పుడే బాగుండేది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెంచి మా లాంటి వాళ్లెందరికో తొలగించారు. ఏంది సార్! ఇంత అన్యాయం.... మేయర్: ఏమవ్వా... నీకు పింఛన్ వస్తున్నదా? పీరమ్మ: లేదు నాయనా.. మేయర్: అడగలేదా? పీరమ్మ: అడిగాను, వాళ్లు ఇవ్వలేదు, రెండునెలలైంది ఈయక. ఈలేదని కొడుదునా, తిడుదునా..(ఏడుపు). ఏమి చేయాల నాయనా... పక్కనున్న వాళ్లు: ఈమెకు చెయ్యి కూడా విరిగింది సార్ , ఏ పనిచేసుకోలేదు. మేయర్: ఏమ్మా నీ సమస్య ఏంటి రమణమ్మ: మా నాన్న పింఛన్ తీసేశారు. మేయర్: మీ నాన్న ఏం పనిచేస్తాడమ్మా రమణమ్మ: మా నాన్న రిక్షా తొక్కుతాడు సార్, పింఛన్‌తో ఇంట్లోకి రూ.2 బియ్యం తెచ్చేవాడు. నేనే సాకుతున్నా. పింఛన్ రాకపోవడంతో ఈ వయస్సులో మళ్లీ రిక్షా తొక్కడానికి పోయాడు. కొడుకులే తల్లిదండ్రులను సాకలేని ఈ పరిస్థితుల్లో అల్లుళ్లు ఎలా సాకుతారు చెప్పండి, మీరే న్యాయం చేయాలి సార్.. మేయర్: చేద్దాం తల్లీ.. తప్పకుండా చేద్దాం. (కుంటుకుంటూ ఎదురుగా వస్తున్న ఆవిడను ఉద్దేశించి) మేయర్: ఏమ్మా ఏమైంది? వెంకటసుబ్బమ్మ: కాలుచేయి పడిపోయింది సార్, రిమ్స్‌లో సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు. తెచ్చుకొన్నాను. కానీ పింఛన్ ఇవ్వలేదు. మేయర్: అయ్యో... అలాగా నేను మాట్లాడుతా లేమ్మా...ఫించన్ ఇప్పిస్తాలే. (చెట్టు కింద పరదాలాంటిది ఏర్పాటు చేసుకుని ఉన్న ముసలావిడ వద్ద కూర్చొని) మేయర్: ఏమమ్మా నీకు పింఛన్ వస్తున్నదా? బాధితురాలు: మూడు నెలలుగా రావడం లేదు సార్ మేయర్: నీ పేరేంటి, ఎందుకు రాలేదు? బాధితురాలు: నా పేరు పద్మావతమ్మ, వేరే వారి పేరుతో ఉందని నాకు పింఛన్ ఆపేశారంట. నాకు ఇళ్లు, వాకిలి లేదు. నన్ను సాకేం దుకు ముందు వెనుకా ఎవరూ లేరు. ఈ వీధిలో ఉండేవాళ్లు ఇంత పెడ్తే తినాలి. లేదంటే లేదు. పింఛ న్ వస్తుంటే కొంతైనా ఆపుండేది సార్! మాలాంటోళ్ల కడుపు కొడ్తె ఎట్లా! మీరే చెప్పండి. మేయర్: నీ పేరేంటవ్వా..? బాధితురాలు: తాయమ్మ అయ్యా మేయర్: నీకు పింఛన్ వస్తుందా? బాధితురాలు: ఏడేళ్ల నుంచి పింఛన్ తీసుకొంటున్నా.. ఇప్పుడు నీపేరు లేదు అని చెబుతున్నారు. మేయర్: ఎందుకని? జన్మభూమిలో అడగలేదా? బాధితురాలు: అడిగాను, పేపర్లు తీసుకున్నారంతే. న్యాయం జరగలేదు. నన్ను సాకడానికి పిల్లలు లేరు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈ ప్రభుత్వంకు నాలాంటోళ్ల ఉసురు తగలకుండా పోతుందా? మేయర్: అయ్యో... న్యాయం జరిగేలా చూస్తాంలే అవ్వా.. బాధపడకు... మేయర్: అవ్వా.. బాగున్నావా లక్షుమ్మ: బాగున్నా.. నాయనా మేయర్: నీకు పింఛన్ వస్తోందా.. లేదా? లక్షుమ్మ: లేదు నాయనా...వయసు తక్కువ ఉందని తొలగించారంట. పింఛన్ లేక తినేందుకు పిడిచ లేకుండా పోయింది. రెండొందలు ఇచ్చేటప్పుడే బాగుండె. మాలాంటి వాళ్లందరికీ ఈవయస్సులో అన్యాయం చేస్తాండారు. మేయర్: నిజమే. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ బాధలు లేవు. మేయర్: నీ పేరు ఏమిటమ్మా..? వితంతువు: ఆదెమ్మ సార్.. మేయర్: నీకు కూడా పింఛన్ రావడం లేదా? వితంతువు: అవును సార్.. నాభర్త చనిపోయి పదిహేనేళ్లయింది. అప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నా, ఇప్పుడు తీసేశారు. మేయర్: ఎందుకు నిలిపేశారంట, వితంతువు: ఐదెకరాల పొలం ఉందని పింఛన్ ఆపేశారట. మేయర్: మరి పొలం ఉందా? వితంతువు: అదే పొలం ఉంటే ఈ బతుకు ఎందుకు సార్! మేయర్: నీ పేరే ంటమ్మా బాధితురాలు: హుస్సేనమ్మ, మేయర్: నీకు కూడా పింఛన్ రాలేదా బాధితురాలు: అవును సార్..ఐదెకరాల భూమి ఉందని తీసేశారు. ప్రభుత్వం ముండమోపుల పింఛన్ కూడా ఇయ్యకపోతే ఎళ్లా.. భూమి ఉంటే నాకు ఈగతి ఎందుకు సార్! ఉండడానికి ఇళ్లే సరిగా లేదు. అధైర్య పడొద్దు..అండగా ఉంటా మేయర్: (వీళ్లందరి పేర్లు, పాసుపుస్తకాల ఐడీలు నోట్ చేసుకోమ్మని స్థానిక కార్పొరేటర్ సాయిచరణ్‌కు చెబుతూ...) మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పింఛన్ వచ్చేలా పోరాడుతా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. అధైర్యపడొద్దు. మీ అందరికీ అండగా నిలుస్తా. ఏమేం హామీలు ఇచ్చారంటే.. కడప నగరంలో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు నిధులు అందడంలేదు. అయినప్పటికీ బడ్జెట్ ఉన్నంతలోనే అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఫరిడా నగర్లో ముందుగా రోడ్డు సమస్యకు సత్వరమే పరిష్కారం చూపెడతా. వెంటనే రూ.5లక్షలు మంజూరు చేయించి రోడ్డు నిర్మిస్తాం. ఆ తర్వాత డ్రైనేజీ సమస్య తీరుస్తా. ప్రభుత్వం నుంచి నిధులు సమకూరితే ముందుగా ఇలాంటి కాలనీలకే ప్రాధాన్యత ఇస్తాం. అర్హులైన వారిని పింఛన్ల జాబితా నుంచి తీసేయడంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్నవారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం.