బడుగులకు భరోసా | Ensuring low | Sakshi
Sakshi News home page

బడుగులకు భరోసా

Published Mon, Nov 17 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

బడుగులకు భరోసా

బడుగులకు భరోసా

అది కడప నగరంలోని ఫరిడానగర్. వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని శ్రమజీవులు. మురికి కాలువలతో సహ వాసం చేస్తున్న బడుగులు. స్థానిక పరిశ్రమల్లో దినసరి కూలీలుగా కొందరు, భవన నిర్మాణ కార్మికులుగా మరి కొందరు బతుకులు వెళ్లదీస్తున్నారు. మనిషిలో సత్తువ ఉన్నంత వరకు శ్రమనే నమ్ముకుని జీవించే వారికి పింఛన్ ఊతంగా ఉండేది. మలి సంధ్యలో ఆసరాగా ఉండేది. ఏడెనిమిదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న  వారిని జాబితా నుంచి తొలగించారు.

జిల్లా వ్యాప్తంగా 2.46లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతుంటే అందులో సుమారు 50వేల మందికి పైగా కోత విధిం చారు. ఒక్క కడపలోనే 7900 మందికి పింఛన్లు రద్దు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వయస్సు మళ్లిన వృద్ధులు, ఆసరాలేని వితంతువులకు ఆవేదన  మిగుల్చుతోంది. జీవితంలో అండగా నిలుస్తున్న పింఛన్  కోసం ఆరాటపడుతున్న బడుగులను పలకరించేందుకు కడప మేయర్ కె సురేష్‌బాబు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. బాధితులను స్వయంగా పలకరించి వారి ఆవేదనను తెలుసుకున్నారు.
 
 చిన్నచౌక్ సర్పంచ్‌గా ఉన్నప్పుడు పంచాయితీ మొత్తానికి కేవలం 421 పింఛన్లు మాత్రమే అందేవి. నెలకు రూ.75 చొప్పున మూన్నెళ్లకు  ఒక్కసారి నిర్వహించే జన్మభూమిలో రూ.225 ఇచ్చేవారు. ఎనిమిది పంచాయితీలు కడప మున్సిపాలిటీలో విలీనం అయ్యాక  కడప కార్పొరేషన్ పరిధిలో మొత్తం 6వేల మందికి పింఛన్లు అందేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక, కుల, మత, వర్గాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇచ్చారు.

కార్పొరేషన్‌లో 18,900 మందికి నెలకు రూ.200 చొప్పున క్రమం తప్పకుండా ప్రతినెలా పింఛన్ అందేది. ఉద్యోగులకు జీతం అం దినట్లుగా 1నే పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులకు ఊతకర్రగా, వితంతువులకు ఆసరాగా, చేనేతలకు వెన్నుదన్నుగా ఆ  పింఛన్లు  నిలిచేవి. టీడీ పీ అధికారంలోకి వచ్చాక అడ్డదిడ్డంగా పిం ఛన్లు తొలగిస్తున్నారు. ఒక్క నగరంలోనే 7,900 పింఛన్లు తొల గించారు. అదేమం టే 5ఎకరాల భూమి ఉందంటారు.

ఉండేందుకు ఇళ్లు కూడా లేని నిరుపేదలకు భూమి ఎక్కడిది.. కడప నగరంలో ఐదు ఎకరాల భూమి ఉంటే పింఛన్  తీసుకునే అగత్యం ఎం దుకు ఉంటుంది.. రేషన్ ,  ఆధార్ కార్డులలో వయస్సు తేడా ఉందని వితంతువులకు సైతం  పింఛన్లు తొలగిస్తున్నారు. వయస్సు తేడా ఉన్నంత మాత్రన వారు వితంతువులు కారా.. ప్రభుత్వం పూర్తిగా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోంది.వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఆసరా కోల్పోయిన వితంతువులకు అన్యాయం చేశారు. అర్హులందరికీ వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలి.
 
 మేయర్: ఏం పెద్దాయనా..
 బాగున్నావా?
 హుస్సేనప్ప: ఏదో ఇట్టా ఉండా సారూ..
 మేయర్: ఏమైంది..పింఛన్ రావడం లేదా?
 హుస్సేనప్ప:  రావడం లేదు సార్..
 మేయర్: ఎందుకు రాలేదు?
 హుస్సేనప్ప: ఐదెకరాల భూమి ఉందని తీసేశారంట..నాకు ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేదు మీరే చూడండయ్యా...
 మేయర్: నిజమే..ఈ పెంకుటింట్లో ఎంతమంది ఉంటున్నారు ?
 హుస్సేనప్ప: ఐదుగురం ఉంటాం సార్, నా కొడుకు కష్టంపై మేమంతా బతుకుతున్నాం. పింఛన్ వస్తుంటే  నేను భారం కాకుండా ఉండేది.
 
 మేయర్:  ఏమవ్వా.. నీపేరేమి?
 వృద్ధురాలు:  చౌడమ్మ నాయనా
 మేయర్: నీకు పింఛన్ వస్తుందా?
 వృద్ధురాలు: ఏడేళ్లుగా పింఛన్ వస్తూ ఉండేది.
 మూడునెలలుగా రావడం లేదు
 మేయర్: ఎందుకు రావడంలేదు?
 వృద్ధురాలు: ఎందుకో తెలియదు.. ఇంతకాలం ఇస్తున్న పింఛన్‌ను  ఇప్పుడు ఎందుకు ఇవ్వరు.
 
 మేయర్: ఏమ్మా  ఎలా ఉన్నావు?
 నారాయణమ్మ: బాగుండా సార్, నాకు కూడా పింఛన్ రాలేదు సార్..
 మేయర్: ఎందుకు అని అడగలేదా..!
 నారాయణమ్మ:  ఆధార్ కార్డులో తప్పు ఉందంటా, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, ఐదేళ్లనుంచి పింఛన్ తీసుకుంటున్నా, ఇప్పుడు రాదుపో అంటున్నారు సార్..
 మేయర్: మీకందరికీ న్యాయం జరిగేలా చేద్దాం లేమ్మా.
 మేయర్: నీ పేరేమిటి తల్లీ ?
 బాధితురాలు:  సుబ్బలక్షుమ్మ సార్
 మేయర్: నీ సమస్య ఏంటి?
 బాధితురాలు: నాకు భర్త లేడు సార్, ఆధార్ కార్డులో తప్పు ఉందని పింఛన్ తొలగించారు. రూ. 200 పింఛన్ ఇస్తున్నప్పుడే బాగుండేది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెంచి మా లాంటి వాళ్లెందరికో తొలగించారు. ఏంది సార్! ఇంత అన్యాయం....
 
 మేయర్: ఏమవ్వా...
 నీకు పింఛన్ వస్తున్నదా?
 పీరమ్మ: లేదు నాయనా..
 మేయర్: అడగలేదా?
 పీరమ్మ: అడిగాను, వాళ్లు ఇవ్వలేదు,  రెండునెలలైంది ఈయక. ఈలేదని కొడుదునా, తిడుదునా..(ఏడుపు). ఏమి చేయాల నాయనా...
 పక్కనున్న వాళ్లు: ఈమెకు చెయ్యి కూడా విరిగింది సార్ ,
  ఏ పనిచేసుకోలేదు.
 
 మేయర్: ఏమ్మా నీ సమస్య ఏంటి
 రమణమ్మ: మా నాన్న పింఛన్ తీసేశారు.
 మేయర్: మీ నాన్న ఏం పనిచేస్తాడమ్మా
 రమణమ్మ: మా నాన్న రిక్షా తొక్కుతాడు సార్, పింఛన్‌తో ఇంట్లోకి రూ.2 బియ్యం తెచ్చేవాడు. నేనే సాకుతున్నా. పింఛన్ రాకపోవడంతో ఈ వయస్సులో మళ్లీ రిక్షా తొక్కడానికి పోయాడు. కొడుకులే తల్లిదండ్రులను సాకలేని ఈ పరిస్థితుల్లో అల్లుళ్లు ఎలా సాకుతారు చెప్పండి,  మీరే న్యాయం చేయాలి సార్..
 మేయర్: చేద్దాం తల్లీ.. తప్పకుండా  చేద్దాం.
 (కుంటుకుంటూ ఎదురుగా వస్తున్న
 ఆవిడను ఉద్దేశించి)  
 మేయర్: ఏమ్మా ఏమైంది?
 వెంకటసుబ్బమ్మ: కాలుచేయి పడిపోయింది సార్, రిమ్స్‌లో సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు. తెచ్చుకొన్నాను. కానీ పింఛన్ ఇవ్వలేదు.
 మేయర్: అయ్యో... అలాగా నేను మాట్లాడుతా లేమ్మా...ఫించన్ ఇప్పిస్తాలే.
 
 
 (చెట్టు కింద పరదాలాంటిది ఏర్పాటు చేసుకుని ఉన్న ముసలావిడ వద్ద కూర్చొని)
 మేయర్: ఏమమ్మా నీకు పింఛన్ వస్తున్నదా?
 బాధితురాలు: మూడు నెలలుగా రావడం లేదు సార్
 మేయర్: నీ పేరేంటి, ఎందుకు రాలేదు?
 బాధితురాలు: నా పేరు పద్మావతమ్మ, వేరే వారి పేరుతో ఉందని నాకు పింఛన్ ఆపేశారంట. నాకు ఇళ్లు, వాకిలి లేదు. నన్ను సాకేం దుకు ముందు వెనుకా ఎవరూ లేరు. ఈ వీధిలో ఉండేవాళ్లు ఇంత పెడ్తే తినాలి. లేదంటే లేదు. పింఛ న్  వస్తుంటే కొంతైనా ఆపుండేది సార్! మాలాంటోళ్ల కడుపు కొడ్తె ఎట్లా! మీరే చెప్పండి.
 
 మేయర్:  నీ పేరేంటవ్వా..?
 బాధితురాలు:  తాయమ్మ అయ్యా
 మేయర్: నీకు పింఛన్ వస్తుందా?
 బాధితురాలు: ఏడేళ్ల నుంచి పింఛన్ తీసుకొంటున్నా.. ఇప్పుడు నీపేరు లేదు అని చెబుతున్నారు.
 మేయర్: ఎందుకని? జన్మభూమిలో అడగలేదా?
 బాధితురాలు: అడిగాను, పేపర్లు తీసుకున్నారంతే. న్యాయం జరగలేదు. నన్ను సాకడానికి పిల్లలు లేరు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈ ప్రభుత్వంకు నాలాంటోళ్ల  ఉసురు తగలకుండా పోతుందా?
 మేయర్: అయ్యో... న్యాయం జరిగేలా చూస్తాంలే అవ్వా.. బాధపడకు...
 
 మేయర్: అవ్వా..
 బాగున్నావా
 లక్షుమ్మ: బాగున్నా..
 నాయనా
 మేయర్: నీకు పింఛన్
 వస్తోందా.. లేదా?
 లక్షుమ్మ: లేదు నాయనా...వయసు తక్కువ ఉందని తొలగించారంట. పింఛన్ లేక తినేందుకు పిడిచ లేకుండా పోయింది. రెండొందలు ఇచ్చేటప్పుడే బాగుండె.  మాలాంటి వాళ్లందరికీ ఈవయస్సులో అన్యాయం చేస్తాండారు.
 మేయర్: నిజమే. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఈ బాధలు లేవు.
 
 మేయర్: నీ పేరు
 ఏమిటమ్మా..?
 వితంతువు: ఆదెమ్మ సార్..
 మేయర్:  నీకు కూడా పింఛన్ రావడం లేదా?
 వితంతువు: అవును సార్.. నాభర్త చనిపోయి పదిహేనేళ్లయింది. అప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నా, ఇప్పుడు తీసేశారు.
 మేయర్: ఎందుకు నిలిపేశారంట,   
 వితంతువు: ఐదెకరాల పొలం ఉందని పింఛన్ ఆపేశారట.
 మేయర్: మరి పొలం ఉందా?
 వితంతువు: అదే పొలం ఉంటే ఈ బతుకు ఎందుకు సార్!
 
 
 మేయర్: నీ పేరే ంటమ్మా
 బాధితురాలు:  హుస్సేనమ్మ,
 మేయర్: నీకు కూడా పింఛన్ రాలేదా
 బాధితురాలు: అవును సార్..ఐదెకరాల భూమి ఉందని తీసేశారు. ప్రభుత్వం ముండమోపుల పింఛన్ కూడా ఇయ్యకపోతే ఎళ్లా.. భూమి ఉంటే నాకు ఈగతి ఎందుకు సార్! ఉండడానికి ఇళ్లే సరిగా లేదు.
 
 అధైర్య పడొద్దు..అండగా ఉంటా
 
 మేయర్: (వీళ్లందరి పేర్లు, పాసుపుస్తకాల ఐడీలు నోట్ చేసుకోమ్మని స్థానిక కార్పొరేటర్ సాయిచరణ్‌కు చెబుతూ...) మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి  పింఛన్ వచ్చేలా పోరాడుతా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. అధైర్యపడొద్దు.  మీ అందరికీ అండగా నిలుస్తా.
 
 ఏమేం హామీలు ఇచ్చారంటే..
 
 కడప నగరంలో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు నిధులు అందడంలేదు. అయినప్పటికీ బడ్జెట్ ఉన్నంతలోనే అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఫరిడా నగర్‌లో ముందుగా రోడ్డు సమస్యకు సత్వరమే పరిష్కారం చూపెడతా. వెంటనే రూ.5లక్షలు  మంజూరు చేయించి రోడ్డు నిర్మిస్తాం. ఆ తర్వాత డ్రైనేజీ సమస్య తీరుస్తా.

ప్రభుత్వం నుంచి నిధులు సమకూరితే ముందుగా ఇలాంటి కాలనీలకే ప్రాధాన్యత ఇస్తాం. అర్హులైన వారిని పింఛన్ల జాబితా నుంచి తీసేయడంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్నవారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement