కట్టేనా..ఎగ్గొట్టేనా ! | Kattenaeggottena! | Sakshi
Sakshi News home page

కట్టేనా..ఎగ్గొట్టేనా !

Published Sat, Jan 10 2015 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

కట్టేనా..ఎగ్గొట్టేనా !

కట్టేనా..ఎగ్గొట్టేనా !

తెనాలి అర్బన్ :  ఇందిరమ్మ గృహ నిర్మాణానికి గ్రహణం పట్టింది. నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయా యి. ముందస్తు పెట్టుబడి పెట్టి నిర్మాణాన్ని చేపట్టిన బడుగులు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయో రావో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం ఉండాలన్న సదాశయంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి.
 
అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది పేదలు తమ సొంతింటి కలను నిజం చేసుకున్నారు. గృహ నిర్మాణానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ లబ్ధిదారులకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, పట్టణ ప్రాంతంలోని ఓసీ, బీసీలకు రూ.80 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఓసీ, బీసీలకు రూ.70వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.  వైఎస్సార్ మరణం తరువాత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. అరకొరగా నిధులు మంజూరు చేసి, చేతులు దులుపుకుంది.
 
2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదల అభ్యున్నతి పేరిట ఎన్నో ప్రకటనలు చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వారి గురించి ఆలోచించే తీరికలేనట్టుగా వ్యవహరిస్తోంది.
 
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హయాంలో మూడవ విడత రచ్చబండలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేసింది. లబ్ధిదారులు గృహ నిర్మాణాలను చేపట్టారు. ఈలోగా ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల గృహ నిర్మాణానికి పైసా కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు.
 
గృహ నిర్మాణ సంస్థ చెల్లింపులకు సంబంధించిన వెబ్‌సైట్ కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో వ్యయప్రయాసలకోర్చి గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల పరిస్థితి అయోమయంగా మారింది. బిల్లులు చెల్లిస్తారన్న నమ్మకం కూడా రోజురోజుకూ వారిలో సన్నగిల్లి పోతోంది.
 
మరోవైపు జియో ట్యాగింగ్....
గృహ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపుల్లో అవకతవకలను నిరోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫొటో ప్రక్రియ జియో ట్యాగింగ్. ఈ విధానం ద్వారా ఇంటి ఫొటోను ఆన్‌లైన్‌లో ఉంచితే, ఒకసారి బిల్లులు చెల్లింపులు పూర్తయిన ఇంటికి, మరోసారి చెల్లించే అవకాశం ఉండదు. మొదటి విడతలో నిర్మించిన ఇళ్లకు జియో ట్యాగింగ్ అమలు చేసే ప్రక్రియలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారులు బిల్లుల చెల్లింపుపై ప్రశ్నిస్తే అధికారులు దీనిని సాకుగా చూపి తప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
 
వడ్డీలు కట్టలేక..
అమరావతి : ఇందిరమ్మ ఇళ్లకు ఏడాదిన్నరగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు బిల్లులు చెల్లిస్తారో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఇందిరమ్మ పథకం కింద మొత్తం 5,631ఇళ్లు మంజూరయ్యాయి.

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదటి విడతలో 1563, రెండవ విడతలో 1820, మూడవ విడతలో 1200 గృహాలు మంజూరు చేశారు. ఇందులో  4,307 నిర్మాణాలు పూర్తి చేసి 1,406 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. మిగిలిన 1324 మంది లబ్ధిదారుల్లో  506 మంది నిర్మాణమే ప్రారంభించలేదు. మరో 195 మందికి ఇప్పటివరకు బిల్లులు మంజూరు కాలేదు. మరికొన్ని పునాదుల దశలోనూ, శ్లాబు దశల్లో నిలిచిపోయాయి.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ...
ఎన్నికల తరువాత రాష్ర్ట వ్యాప్తంగా గృహ నిర్మాణాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను సైతం మూసివేశారు. ఈ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా రూ.100కోట్ల పైమాటే. తెనాలి నియోజకవర్గంలో దాదాపు 60 గృహాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రం విడిపోయినా గృహనిర్మాణ సంస్థ విడిపోలేదు. నెల రోజుల్లోగా విడిపోయే పరిస్థితి ఉంది. ఆ తరువాతే ఈ బిల్లుల చెల్లింపునకు మోక్షం కలిగే అవకాశం ఉంది.
 - కేఎస్ ప్రకాశరావు, డీఈ, హౌసింగ్, తెనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement