సత్తా చాటిన నలుగురు అమ్మాయిలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ విమెన్ కాలేజీ కి చెందిన నలుగురు విద్యార్థినులు మరోసారి తమ సత్తా చాటారు. తమ అత్యుత్తమ ప్రతిభతో ఓ విదేశీ కన్సల్టింగ్ ప్రాజెక్ట్ ఇంటర్న్ షిప్ కు ఎంపికయ్యారు. బ్రెజీలియన్ కంపెనీ ఎంబ్రాకో అందించే రెండు లక్షల ఇంటర్న్షిప్ ను గెల్చుకున్నారు. ఈ ఏడాది సమ్మర్ ఇంటర్న్ షిప్ పేరుతో అందించే అత్యధిక రూ 2 లక్షల పారితోషికాన్ని అందుకున్నారు.
ఎల్ఎస్ఆర్ మహిళా కాలేజీ స్టూడెంట్స్ అదితి మిశ్రా(బీకామ్), దెబోలినా దత్తా (ఎకనామిక్స్),ప్రేరణా గ్రోవర్ (స్టాటస్టిక్స్ ) అయూషి సేథ్ (జర్నలిజం) ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికయ్యారు. కన్సల్టింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశానికి చెందిన విద్యార్థులను మొదటిసారి ఎంపిక చేశామని సంస్థ ఆసియా ఫసిపిక్ రీజియన్ డైరెక్టర్ అరుప్ మజుందార్ తెలిపారు.
దేశం నుంచి మరింత కొలాబరేషన్స్ కోసం చూస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే ఎల్ఎస్ఆర్ కాలేజీ 97 మంది అమ్మాయిలు ఇతర సంస్థలనుంచి ఇంటర్న్షిప్ ను అందుకున్నారు. మరో 300 మంది ఎర్నెస్ట్ అండ్ యంగ్, జెఎస్డబ్ల్యు, కేపీఎంజీ,హాన్నోవర్ రే తదితర సంస్థల్లో ఇంటర్న్ షిప్ పూర్తి చేయడం విశేషం.