బహదూర్‌పురా ఫ్లై ఓవర్ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరం కోర్‌సిటీ వైపు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్‌నగర్ జిల్లా వైపు (పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కాకుండా) రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగించేలా పాతబస్తీలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
బహదూర్‌పురా జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి, జూపార్కు సందర్శించే టూరిస్టులకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. ఫ్లై ఓవర్‌తోపాటు మీరాలం ట్యాంక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, ముర్గీచౌక్, మీరాలంమండి, సర్దార్ మహల్ ఆధునికీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటితోపాటు కార్వాన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో రూ.297 కోట్ల విలువైన సివరేజి పనులకు, కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు.
బహదూర్‌పురా ఫ్లై ఓవర్
నిర్మాణ వ్యయం: రూ. 69 కోట్లు
పొడవు: 690 మీటర్లు
వెడల్పు: 24 మీటర్లు
క్యారేజ్‌వే: రెండు వైపులా(ఒక్కోవైపు 3లేన్లు)
► ప్రాజెక్టులో భాగంగా జరిపిన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ తదితరాలు కలిపితే మొత్తం వ్యయం రూ.108 కోట్లు.
► ట్రాఫిక్ చిక్కులు తప్పడంతోపాటు ప్రయాణ సమయం, వాహన.. ధ్వని కాలుష్యం, ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం వంటివి తగ్గుతాయి.
► ఫ్లై ఓవర్ కింద పచ్చదనం ప్రజలకు ఆహ్లాదం కలిగించనుంది.
► క్రాష్‌బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్ తదితర పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించినట్లు, పాతబస్తీలో ఈ టెక్నాలజీ వాడటం దీనితోనే ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ దత్తుపంత్ తెలిపారు.
పాతబస్తీలో పనులు..
కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాత బస్తీలోనూ పలు పనులు చేపట్టారు. పాతబస్తీ వైపు ప్రయాణించే వారికి ఇప్పటికే ఏపీజీ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్, బైరామల్‌గూడ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడం తెలిసిందే.
కొత్తగా చేపట్టినవి..
ముర్గీచౌక్ (మహబూబ్‌చౌక్) ఆధునికీకరణ
వ్యయం : రూ. 36 కోట్లు.
మాంసం మార్కెట్‌గా పేరుగాంచిన ముర్గీచౌక్ కాంప్లెక్స్‌ను సంప్రదాయ డిజైన్‌ను మార్చకుండా అదనపు అంతస్తుతో ఆధునికీకరించనున్నారు. ప్లాజా ఎంట్రెన్స్ వరకు లైటింగ్, బెంచీలు, పచ్చదనం వంటివాటితో నవీకరించనున్నారు. ప్రదేశం చరిత్రను కాపాడుతూనే నగరీకరణకు అనుగుణంగా మార్చనున్నారు.
మీరాలం మండి..
వ్యయం: రూ.21.90 కోట్లు
అతి పెద్ద, పురాతన మీరాలం మండిని విక్రేతలకు తగిన ప్లాట్‌ఫారాలు, షెడ్లు, అంతర్గత రోడ్లు, నడక దారులు వంటి వాటితోపాటు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆధునికీకరించనున్నారు. ఈ మార్కెట్లో 43 హోల్సేల్దుకాణాలతోపాటు దాదాపు 300 మంది విక్రేతలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు.
సర్దార్‌మహల్..
వ్యయం : రూ. 30 కోట్లు
వారసత్వ భవనమైన సర్దార్‌మహల్‌ను 1900 సంవత్సరంలో నిర్మించారు. శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ, ఆధునికీకరణలతో పాటు సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి
చేయనున్నారు.
మీరాలంట్యాంక్ మ్యూజికల్ ఫౌంటెన్..
వ్యయం: రూ. 2.55 కోట్లు
జూపార్కు సందర్శకులకు మరో ఆకర్షణగా దగ్గర్లోనే ఉన్న మీరాలంట్యాంక్ వద్ద వినియోగంలోకి రానున్న మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక రంగుల లైటింగ్, మ్యూజిక్లతో పర్యాటకులను ఆకట్టుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాల వ్యవధితో రెండు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఎస్సార్డీపీతో..
జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు వంటి పనులకు ప్రత్యేకంగా ఎస్సార్డీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎస్సార్డీపీ మొదటిదశలో చేపట్టిన 47 నుల్లో దాదాపు 30 పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వాటిలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లున్నాయి.
మ్యూజికల్ ఫౌంటెన్.. డ్యాన్సింగ్ అదిరెన్
నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేసే అద్భుతమైన మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెన్ మంగళవారం ప్రారంభమైంది.పాతబస్తీ వాసులతో పాటు జూపార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు దీంతో ఎంతగానో ఆహ్లాదం కలగనుంది. ఈ ఫౌంటెన్ ఒక వినూత్నమైన అనుభవాన్ని అందజేయనుంది. రంగు రంగుల హరివిల్లులతో మ్యూజికల్ ఫౌంటెన్ ఒకేసారి సంగీతాన్ని, డ్యాన్సింగ్ ఎఫెక్ట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆధునిక సాంకేతికత, సంగీతాలను మేళవించుకొని పని చేసేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.