సంజయ్ బెయిల్ పిటిషన్ వాయిదా
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్): మాజీ మేయర్ డి. సంజయ్ బెయిల్ పిటిషన్ రేపటికి(గురువారం) వాయిదా వేస్తూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ కోర్టు ప్రత్యేక జడ్జి రమేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలతో కూడిన కేసు డైరీ(సీడీ)ని మంగళవారం పీపీ శశికిరణ్‌రెడ్డికి అందించాల్సి ఉంది. కాగా పోలీసులు అందించలేదు. దాంతో పీపీ కేసు డైరీ తనకు అందలేదని, డైరీ స్వీకరించాక తదుపరి డైరీలోని అంశాలను చదివాకే తన వాదనలు వినిపిస్తానని కోర్టుకు విన్నవించారు.
దాంతో జడ్జి రమేష్‌కుమార్ పీపీ శశికిరణ్‌రెడ్డి అభ్యర్థన మేరకుపై నిర్ణయం తీసుకుంటూ సంజయ్ తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సంజయ్ తరపున న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తు పత్రాలు తీసుకున్న ప్రాసిక్యూషన్ అధికారి బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు గురించి వివరిస్తూ బెయిల్ దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సంజయ్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును తిరస్కరించాలని జడ్జికి సైతం నివేదించనున్నట్లు తెలిసింది.
కేసు డైరీ సమర్పణ జాప్యం ఆంతర్యమేంటో?
జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మేయర్ సంజయ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు గురువారానికి వాయిదా పడటం, ఆయనకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం లేకుండా చేసేందుకు పోలీసులు కేసు డైరీ(సీడీ)ని పీపీకు సమర్పించే విషయంలో పోలీసులు చేస్తున్న జాప్యం వెనుక గల కారణాలు ఏమిటోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి సంజయ్ తరపున న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు.
దీనిపై కోర్టులో మంగళవారం వాదనలు జరుగాల్సి ఉండగా, నాల్గోటౌన్ పోలీసులు కేసు కేసు డైరీ(సీడీ)ని పీపీకి అందకపోవడంతో, బెయిల్ పిటిషన్‌పై విచారణను జడ్జి గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పోలీసులు సంజయ్‌ను కస్టడిలోకి తీసుకునేందుకు కస్టడి పిటిషన్ వేయనున్నారు. దీని కోసం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ మంగళవారం మధ్యాహ్నం జిల్లా కోర్టుకు వచ్చి పీపీతో మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది. గురువారం పోలీసులు వేయనున్న కస్టడి పిటిషన్‌పై న్యాయవాదులు సంజయ్‌ను ఎందుకు కస్టడీ కోరుతున్నారో జవాబు ఇవ్వాలని కౌంటర్ వేస్తారు.
ఈ కౌంటర్‌పై వాదనలు మరుసటి రోజు అంటే శుక్రవారానికి పెట్టే అవకాశం లేకపోలేదు. దీనిపై న్యాయమూర్తి వాదనాలు వినే అవకాశం ఉంటే వాదనలు విని సంజయ్‌కు బెయిల్ ఇచ్చే విషయంలో అభ్యంతరం లేదంటే సంజయ్‌కు బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వాదనలు రానున్న సోమవారం విని మంగళవారం బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రేపు పోలీసులు కస్టడి పిటిషన్ వేయకుంటే సంజయ్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కోర్టుకు కేసు డైరీ సమర్పణలో జాప్యం చేస్తుండటంపై సంజయ్‌కు బెయిల్ త్వరగా రాకుండా పోతోందని గుసగుసలు వినబడుతున్నాయి.