అజేయ ఆసీస్
బెయిలీ జట్టుకే ముక్కోణపు టోర్నీ టైటిల్
* ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం
* మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో
* రాణించిన మార్ష్, ఫాల్క్‌నర్
పెర్త్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావించిన ముక్కోణపు టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (98 బంతుల్లో 95; 15 ఫోర్లు; 4/46) ఆల్‌రౌండ్ షోకు తోడు... మిచెల్ మార్ష్ (68 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (24 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సమయోచితంగా స్పందించడంతో ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన బెయిలీ బృందం అజేయంగా నిలువడంతోపాటు టైటిల్‌ను దక్కించుకుంది.
‘వాకా’ మైదానంలో ఆదివారం జరిగిన ఫైన ల్లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 278 పరుగులు చేసింది. స్మిత్ (50 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా... ఫించ్ (0), వార్నర్ (12), బెయిలీ (2) నిరాశపర్చారు. దీంతో ఆసీస్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్, మార్ష్‌లు ఆచితూచి ఆడుతూనే భారీ స్కోరుకు బాటలు వేశారు. 25వ ఓవర్లో జట్టు స్కోరును 100 పరుగులను దాటించిన ఈ జోడి క్రమంగా బ్యాట్ ఝుళిపించింది.
బ్యాటింగ్ పవర్‌ప్లేలో వీరిద్దరు 46 పరుగులు రాబట్టడంతో 41వ ఓవర్లో ఆసీస్ స్కోరు 200లకు చేరుకుంది. కానీ దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 141 పరుగులు జతచేశారు. ఓ ఎండ్‌లో సహచరులు వెనుదిరుగుతున్నా... రెండో ఎండ్‌లో ఫాల్క్‌నర్ వీరవిహారం చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లను హడలెత్తిస్తూ చివరి 8 ఓవర్లలో 78 పరుగులు జత చేశాడు. 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ఫాల్క్‌నర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు.
తర్వాత ఇంగ్లండ్ 39.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రవి బొపారా (59 బంతుల్లో 33; 1 ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొయిన్ అలీ (26), రూట్ (25), బ్రాడ్ (24) ఓ మోస్తరుగా ఆడారు. నాలుగో ఓవర్లో బెల్ (8) అవుటైన తర్వాత జాన్సన్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీశాడు. టేలర్‌తో పాటు వరుస బంతుల్లో అలీ, మోర్గాన్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బొపారా నిలకడగా ఆడినా... 25వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ వరుస బంతుల్లో బట్లర్ (17), వోక్స్ (0)లను అవుట్ చేశాడు. బ్రాడ్‌తో ఎని మిదో వికెట్‌కు 32; ఫిన్ (6)తో తొమ్మిదో వికెట్‌కు 30 పరుగులు జోడించి బొపారా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫిన్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 278/8 (50 ఓవర్లలో) (మ్యాక్స్‌వెల్ 95, మార్ష్ 60, ఫాల్క్‌నర్ 50 నాటౌట్; బ్రాడ్ 3/55); ఇంగ్లండ్: 166 ఆలౌట్ (39.1 ఓవర్లలో) (బొపారా 33, జాన్సన్ 3/27).