రాష్ట్రంలో మరో 8 బజాజ్ సెంటర్స్
హైదారబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటించింది. ఇందుకోసం ‘బజాజ్ వరల్డ్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్) పి.ఎస్.టాండన్ తెలిపారు. తాము ఉత్పత్తి చేసే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ వస్తువులన్నీ ఒకే చోట ఉండే విధంగా బజాజ్ వరల్డ్ పేరుతో ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే తొలి కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాదిలోగా మరో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే నెలరోజుల్లో హైదరాబాద్‌లో బజాజ్ వరల్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65 బజాజ్ వరల్డ్ స్టోర్స్ ఉన్నాయని, రెండు నెలల్లో ఈ సంఖ్య 75కి చేరుతుందన్నారు.
బజాజ్ ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో డీలర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ ఎలక్ట్రికల్ విభాగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రెషర్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్స్ వంటి నాన్ ఎలక్ట్రికల్ విభాగంలోకి ఏడాదిన్నర క్రితం ప్రవేశించామని, ఈఏడాది రూ. 100 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈ ఏడాది బజాజ్ ఎలక్ట్రికల్స్ మొత్తం ఆదాయం రూ.4,200 కోట్లకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5,000 కోట్లు దాటుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆర్అండ్డీ కేంద్రం
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ముంబైలో రూ.50-60 కోట్లతో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టండన్ తెలిపారు. ఇది మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, అలాగే నాసిక్‌లో రూ.25 కోట్లతో వాటర్ హీటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దేశీయంగా విస్తరించడంతోపాటు ఎగుమతులపై కూడా దృష్టిసారిస్తున్నామని, ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఒక శాతం వాటాగా ఉన్న ఎగుమతులు విలువ వచ్చే ఏడాది రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రూ.40 కోట్లు, వచ్చే ఏడాది రూ.100 కోట్ల అమ్మకాలు ఎగుమతులు ద్వారా వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.