అచ్చం బజరంగీ భాయ్‌జాన్ కథే... మరి హీరో?
కరాచీ: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న 'బజరంగీ భాయ్‌జాన్' చిత్రంలో చిన్నారి షాహిద్ అలియాస్ మున్నీ గుర్తుందా....అచ్చం ఈ సినిమాలోని చిన్నారి లాగానే పాకిస్తాన్లో ఓ యువతి భారత్‌లో ఉన్న తన కన్నవాళ్లను కలుసుకునేందుకు తపించిపోతోంది. గత 15 ఏళ్లుగా పాకిస్తాన్‌లోని ఒక అనాధ శరణాలయంలో ఉంటున్న ఆమె నిత్యం తన కుటుంబాన్ని తలచుకుంటూ కుమిలిపోతోంది. తనను.. తన కుటుంబసభ్యులతో కలిపేవారి కోసం ఎదురు చూస్తోంది. సినిమాలోని చిన్నారి షాహిద్ లాగానే ఆ యువతి కూడా పుట్టు చెముడు, మూగ.
ఇదంతా...పాకిస్తాన్ హక్కుల కార్యకర్త అన్సర్ బర్నే సోషల్ మీడియాలో పంచుకోడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ యువతి కుటుంబసభ్యుల వివరాలు ఎవరికైనా తెలిస్తే సాయం చేయమంటూ విజ్ఞప్తి చేశారు. తన సైగల ద్వారా తనకు 12మంది తోబుట్టువు ఉన్నారని, వారిలో ఏడుగురు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు వున్నారని తెలిసిందన్నారు. ఆ యువతి వయసు 22, 24 సంవత్సరాల మధ్య ఉంటుందని అయితే పొట్టిగా ఉండటం వల్ల చిన్నదానిలా కనిపిస్తుందని తెలిపారు. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమెగా భావిస్తున్నామని తెలిపారు.
మూడేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులను వెతికేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని, సల్మాన్ ఖాన్ సినిమా చూసిన తరువాత మళ్లీ తనలో ఆశలు చిగురించాయని అన్సర్ బర్నే తెలిపారు. తాను సెప్టెంబర్‌లో భారత్‌కు వస్తున్నానని, అపుడు ఆమెను ఆమె కుటుంసభ్యుల వద్దకు చేర్చాలనేది తన కోరిక అని ఆయన వెల్లడించారు. అందుకు భారత ప్రభుత్వం సహకరిస్తే బావుంటుందని బర్నే ఆశిస్తున్నారు.
కాగా సుమారు ఏడేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన గీత.. అలా.. అలా. పాకిస్తాన్ చేరింది. పలు అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందింది. చివరకు పాకిస్తాన్లో పేరుపొందిన ఈధీ ఫౌండేషన్ లో తలదాచుకుంటోంది. ఫౌండేషన్ వాళ్లే అమ్మాయికి గీత అని పేరుపెట్టారు.
'పుట్టు మూగ చెవిటి అయిన గీత తరచూ బిగ్గరగా ఏడూస్తూ ఉంటుంది. ఆమెకు హిందీ రాయడం తెలుసట. హిందూ యువతిలాగా నెత్తిన కొంగు వేసుకుంటుంది, తరచూ గుడికి వెడుతుంద'ని ఈధి ప్రతినిధి తెలిపారు. దీంతో గీత హిందూ సాంప్రదాయ కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నామని, అయితే ఇక్కడున్న ముస్లింలతో పాటు రంజాన్ సందర్భంగా ఆమెకూడా రోజాను పాటించిందన్నారు. కానీ ఆమె హిందూ అమ్మాయిలా ఉండడంతో తమ దగ్గర ఆమెకోసం ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు.
'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలో పుట్టు మూగ అయిన షాహిదా పొరపాటున పాకిస్తాన్ వెళ్లడానికి బదులు.. ఢిల్లీ ట్రైన్ ఎక్కి.. ఇండియా వచ్చేస్తుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చే నాధుడు ఎవరా? అని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పాపను అష్టకష్టాలు పడి చివరికి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో భజరంగీకి పాకిస్తాన్ రిపోర్టర్ నవాజుద్దీన్ ఖాన్ సహాయపడతాడు. మరి ఈ గీతకు శుభం కార్డు వేసే హీరో ఎవరో?