త్యాగధనుల స్ఫూర్తితో బాక్సయిట్ ఉద్యమం
టీడీపీ ప్రభుత్వ కుట్రను అడ్డుకుందాం
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు
పాడేరు: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యా గం చేసిన ఎందరో మహానుభావుల స్పూర్తితో ఏజెన్సీలోని బాక్సయిట్ సంపదను కాపాడుకునేందుకు భారీ ఉద్యమాన్ని చేపడతానని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చెప్పా రు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని ఆంగ్లేయులు వదిలి వెళ్లినా ప్రస్తుత పాలకులు, అధికారులు గిరిజనుల సంపదను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గనులను దోచుకునేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గిరిజనులంతా అడ్డుకోవాలన్నారు. బాక్సయిట్ను వెలికి తీస్తే గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఖనిజాలతో సహా ప్రకృతి సంపద కూడా నాశనమవుతుందని, తాగునీటి వనరుల్లేక దుర్భర జీవితం సాగించాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు. బాక్సయిట్ వెలికితీత వల్ల అడవులన్నీ సర్వనాశనమై గిరిజనులు జీవించే పరిస్థితి కూడా ఉండదన్నారు.
గిరిజనుల జీవించే హక్కును హరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బాక్సయిట్ను వ్యతిరేకిస్తూ తాను చేపట్టే మహోన్నత ఉద్యమానికి అన్ని వర్గాల గిరిజనులు, రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలన్నారు.