షుగర్ వ్యాధిని ఇప్పుడప్పుడే రాకుండా ఆపడానికి ఏం చేయాలి?
ఇటీవల బ్లడ్ షుగర్ చెక్ చేయించుకున్నాను. భోజనానంతరం రీడింగ్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. అయితే అంతమాత్రాన ప్రస్తుతానికి నాకు షుగర్ ఉన్నట్లుగా చెప్పలేకపోయినా భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. పైగా మా తల్లిదండ్రులకు షుగర్ ఉంది. కాబట్టి నాకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీర్ఘకాలంపాటు షుగర్ వ్యాధిని వాయిదా వేయడానికి నేనేం చేయాలో చెబుతూ, నాకు తగిన సలహా ఇవ్వండి.
- యాదగిరి, నకిరేకల్
చాలామంది కొలెస్ట్రాల్, అధిక కొవ్వు వల్లనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయిని అనుకుంటుంటారు. కానీ ఇటీవలి కొత్త అధ్యయనాల వల్ల హై బ్లడ్ షుగర్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుందని తెలుస్తోంది. షుగర్ ఉన్నా లేకపోయినా హై బ్లడ్ షుగర్ వల్ల గుండెకు ఇబ్బందులు కలగడం మాత్రం తప్పవు. మీకు ప్రస్తుతానికి డయాబెటిస్ లేకపోయినా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. జాన్స్ హాప్కిన్స్ అధ్యయనం ప్రకారం డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక శాతం పెరిగితే హార్ట్అటాక్ వచ్చే అవకశాలు 18 శాతం పెరుగుతాయని తెలిసింది. అయితే క్రమ
బద్ధమైన మంచి జీవనశైలితో బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తేడా తీసుకురావచ్చు. ఆహారంలో తక్కువ షుగర్, నూనె, కొవ్వు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకుంటే 30 శాతం వరకు బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, వారానికి కనీసం ఐదు రోజులు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్‌లతో పాటు వారంలో కనీసం రెండు సార్లు గుండె పనితీరు సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాల వల్ల 30 శాతం బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇక పై వ్యాయామాలకు తోడు మెడిటేషన్ చేస్తే ఆ తీవ్రతలోని మరో 30 శాతం మాయమవుతుంది. ఇవన్నీ పాటించగలిగితే బ్లడ్ షుగర్‌లో 10 శాతం బోనస్ రిలీఫ్ కలుగుతుంది. మీరు ఈ రకమైన జీవనశైలిని పాటిస్తూ భవిష్యత్తులో రాబోయే డయాబెటిస్‌ను వీలైనంతగా ఆలస్యం చేయవచ్చు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్