మొల్ల రామాయణం మల్లెల సౌరభం
సహజ కవయిత్రి
మనసును హత్తుకునేలా రచన
ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను
రాజమహేంద్రవరం కల్చరల్ : 'మొల్ల' అంటే 'మల్లె' అని అర్థం. కవయిత్రి మొల్ల తన రామాయణ రచనలో మల్లెపూల సౌరభాలను పాఠకులకు పంచారని అమలాపురానికి చెందిన ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను తెలిపారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్తాధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల రామాయణం–రచనా వైశిష్ట్యం'పై ఆమె ప్రసంగించారు. వేయి సంవత్సరాల తెలుగు సాహిత్య చర్రితలో శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగమని ఆమె కొనియాడారు. మొల్లకు ముందు భానుడు, కాళిదాసు, భవభూతి వంటి ఎందరో రామాయణ మహాకావ్యాన్ని స్పృశించారని చెప్పారు. స్త్రీవిద్యకు దూరంగా ఉన్న రోజుల్లో జన్మించిన మొల్ల చక్కని పదాలతో రామాయణాన్ని మనస్సుకు హత్తుకునేలా చెప్పారని తెలిపారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలలో చెప్పిన రామాయణ కావ్యాన్ని మొల్ల 861 పద్యాలలో వివరించారన్నారు. పోతన లాగే మొల్లకు కూడా గురువులు ఎవరూ లేరు, ఆమె సహజ కవయిత్రన్నారు. ఆమె రాజులను ఆశ్రయించలేదని, సమకాలీన సమాజం నుంచి మొల్ల ఆదరణ, గుర్తింపు పొందలేకపోయారని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ పండిత పామరులను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారని తెలిపారు. మొల్ల స్త్రీ రత్నమని సదనం కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎ.వి.ఎస్.మహాలక్ష్మి కొనియాడారు. మొల్ల శ్రీకృష్ణ దేవరాయలి కాలం నాటికి చెందిన కవయిత్రి కనుక భువన విజయం ప్రసంగాలలో మొల్ల రామాయణం చేర్చామని పద్యసారస్వత పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి చింతలపాటి శర్మ తెలిపారు. రామచంద్రుని మౌనిక స్వాగత వచనాలు పలికారు. ఆదిత్య కళాశాల తెలుగు లెక్చరర్ బి.వి. రమాదేవి వందన సమర్పణ చేశారు. భువన విజయం ప్రసంగాలలో భాగంగా బుధవారం డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు కళాపూర్ణోదయంపై ప్రసంగిస్తారు.