Bala Saibaba
-
ఘనంగా బాలసాయిబాబా 59వ జయంతి ఉత్సవాలు
సాక్షి, కర్నూలు: భగవాన్ శ్రీ బాలసాయిబాబా 59వ జయంతి ఉత్సవాలు కర్నూలులో ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని శ్రీ నిలయంలో జరుగుతున్న ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నేషనల్ కమిషన్ ఫర్ సాయి కరమ్‌చారీస్‌కు చెందిన మనోహర్, తమిళనాడు రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, జాతీయ బాలల హక్కుల సంఘం సలహాదారు రామస్వామి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు, పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
బాలసాయి ఇక లేరు
-
బాలసాయిబాబా ఇకలేరు
సాక్షి, హైదరాబాద్/కర్నూలు టౌన్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా (59) గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆశ్రమంలో ఉన్న ఆయనకు సోమవారం అర్ధరాత్రి ఛాతీ నొప్పి రావడంతో శిష్యులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలసాయి పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి తొలుత దోమలగూడ ఆశ్రమానికి, అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో కర్నూలులోని బాబా ఆశ్రమం శ్రీనిలయానికి తరలించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీనిలయంలో బాలసాయి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు. 18 ఏళ్లకే బాలసాయిబాబాగా అవతారం... కర్నూలులో రామనాథ శాస్త్రి, జయలక్ష్మమ్మ దంపతులకు 1960 జనవరి 14న బాలసాయి జన్మించారు. ఆయన అసలు పేరు బాలరాజు. పదవ తరగతి వరకు చదువుకున్న బాలసాయిబాబాకు కళలంటే ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత బాలసాయిబాబాగా అవతారం ఎత్తారు. 18 ఏళ్ల వయసులోనే కర్నూలులో ఆశ్రమం ఏర్పాటు చేసి.. దైవ ప్రవచనాలు చేయడం ప్రారంభించారు. అనతికాలంలోనే ఆయన ప్రవచనాలు వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, శిష్యులు పెరిగిపోవడంతో కర్నూలు, హైదరాబాద్‌లలో ఆశ్రమాలు నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన తన నోట్లోంచి శివలింగాన్ని బయటకు తీసేవారు. అయితే ఇదంతా కనికట్టు అని జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు విమర్శించేవారు. కానీ ఆ వాదనను బాలసాయి భక్తులు కొట్టిపడేసేవారు. తాము దైవంలా భావించే బాలసాయిబాబాకు మహిమలు ఉన్నాయని నమ్మేవారు. జనవరి 14న తన జన్మదినం సందర్భంగా బాలసాయిబాబా కర్నూలులో నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు చేసే వారు. కర్నూలులోని శ్రీనిలయంలో ప్రతి ఏడాది బాలసాయిబాబా జన్మదినోత్సవానికి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాల నుంచి భక్తులు హాజరయ్యేవారు. బాల సాయిబాబా మరణవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీనిలయం చేరుకున్నారు. బాబాకు సోదరుడు రమేష్‌తో పాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. -
బాల సాయిబాబా కన్నుమూత
హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బాల సాయిబాబా 1960 జనవరి 14న కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి రామనాథ శాస్త్రి కేరళ నుంచి కర్నూలుకు వలస వచ్చారు. బాల సాయిబాబాకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు. కడుపులో నుంచి శివలింగాన్ని తీసే విద్య ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే మధ్యలో కొంతకాలం బాల సాయిబాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు కర్నూలుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. శివరాత్రికి, సంక్రాంతికి బాల సాయిబాబా ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. గతంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేవారు. బాల సాయిబాబా ఆధ్యాత్మికతతో ఎంతగా వార్తల్లో నిలిచారో.. అదేవిధంగా అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు. అదేవిధంగా ట్రస్ట్ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఆయన భౌతిక కాయాన్ని కర్నూలు తరలిస్తామని బాల సాయిబాబా అనుచరుడు తెలిపారు. -
రాజధానికి రూ. 500 కోట్లా!
చాలాకాలం తర్వాత బాల సాయిబాబా తెరమీదకు వచ్చారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందనో, మరోమిటో తెలియదు గానీ... ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంత ఖర్చయినా వెరవకుండా తనను తాను మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించారు. పుట్టినరోజు సాకుతో కేంద్ర, రాష్ట్ర మంత్రులను, విదేశీయులను కూడా భక్తులుగా పిలిపించుకొని మరీ ఉపన్యాసాలు ఇప్పించారు. బాల సాయిబాబా శ్రీనిలయంలో జరిగిన తన 54వ పుట్టినరోజుతో పాటు సంక్రాంతి వేడుకలను అత్యంత కోలాహలంగా చేసుకున్నారు. ఈ స్వాములోరు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్రమంత్రలు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా లాంటి ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించి ప్రత్యేకత కోసం పరితపించారు. లోగుట్టు ఏంటో తెలియదు కానీ... ప్రజాప్రతినిధులు సైతం బాలసాయిబాబాను పొగడ్తలతో ముంచెత్తారు. విదేశీ భక్తులు సైతం బాబా భజనలో తరించారు. ఇక ఎప్పుడూ శాంతి వచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే బాలసాయి తాజాగా రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున పడ్డ సమయంలో పల్లెత్తు మాటకూడా మాట్లాడని బాబా ఇపుడు కర్నూలును రాజధాని చేయాలంటున్నారు. అంతేకాదు, సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేస్తానంటే తనకున్న ఆస్తిలో 500 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ఉదారంగా ప్రకటన చేసి పారేశారు. బాల సాయిబాబాకు ఇంతకు ముందే ప్రజల్లో ఒకరకమైన ఇమేజ్ ఉంది. అసలు బాల సాయిబాబా అనగానే... ఆరోపణలు, కేసులు, అక్రమాలే గుర్తొస్తాయి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల ఆస్తులకు ఎదిగారని కొందరు అంటారు. బాల సాయిబాబా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. మరెన్నో ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసులో... న్యాయస్థానం ఈ బాబాను భూ కబ్జాదారునిగా నిర్థారించింది. ఇలాంటి పరిణామాలే బాబాకు ఇబ్బంది మారాయి. ప్రజల్లో చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ఎన్ని విన్యాసాలు.. సారీ మహిమలు ప్రదర్శించినా నమ్మేవారు కరువయయ్యారు. అందుకే ముందుగా తన మీదున్న మచ్చల్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకున్నారు. ఇక బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే వారు ఏ రేంజికి ఎదిగారో చెప్పనవసరం లేదు. -
బాల సాయిబాబాకు పాదాభివందనం
కర్నూలు: కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వివాదంలో చిక్కుకున్నారు. వివాదస్పద బాల సాయిబాబా పాదాలకు ఆమె పాదాభివందనం చేయడం విమర్శలకు దారి తీసింది. కృపారాణి అజ్ఞానంతో ప్రవర్తించారని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) విమర్శించింది. కేంద్ర మంత్రిగా ఉంటూ దొంగస్వాముల కాళ్లు పట్టుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఏ ప్రయోజనాల కోసం బురిడీ బాబాను ఆశ్రయించారో బయటపెట్టాలని జేవీవీ ప్రతినిధి టీవీ రావు డిమాండ్ చేశారు. ఐటీ మంత్రిగా ఉండి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్న కృపారాణిని బర్తరఫ్ చేయాలన్నారు. బాబాల కాళ్లు పట్టుకుని రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న మంత్రులు, నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని, పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.డబ్బులు తీసుకుని బాబాల చుట్టూ తిరిగే నేతలను సంఘ బహిష్కరణ చేయాలన్నారు. మేజిక్లతో మోసాలు చేసే బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీవీ రావు హెచ్చరించారు. బాలసాయిబాబా శ్రీనిలయంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు కృపారాణితో పాటు రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ హాజరయ్యారు.