బాల సాయిబాబాకు పాదాభివందనం
కర్నూలు: కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వివాదంలో చిక్కుకున్నారు. వివాదస్పద బాల సాయిబాబా పాదాలకు ఆమె పాదాభివందనం చేయడం విమర్శలకు దారి తీసింది. కృపారాణి అజ్ఞానంతో ప్రవర్తించారని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) విమర్శించింది. కేంద్ర మంత్రిగా ఉంటూ దొంగస్వాముల కాళ్లు పట్టుకోవడం ఏంటని ప్రశ్నించింది.
ఏ ప్రయోజనాల కోసం బురిడీ బాబాను ఆశ్రయించారో బయటపెట్టాలని జేవీవీ ప్రతినిధి టీవీ రావు డిమాండ్ చేశారు. ఐటీ మంత్రిగా ఉండి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్న కృపారాణిని బర్తరఫ్ చేయాలన్నారు. బాబాల కాళ్లు పట్టుకుని రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్న మంత్రులు, నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామన్నారు. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని, పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.డబ్బులు తీసుకుని బాబాల చుట్టూ తిరిగే నేతలను సంఘ బహిష్కరణ చేయాలన్నారు.
మేజిక్లతో మోసాలు చేసే బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీవీ రావు హెచ్చరించారు. బాలసాయిబాబా శ్రీనిలయంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు కృపారాణితో పాటు రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ హాజరయ్యారు.