రాజధానికి రూ. 500 కోట్లా!
చాలాకాలం తర్వాత బాల సాయిబాబా తెరమీదకు వచ్చారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుందనో, మరోమిటో తెలియదు గానీ... ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంత ఖర్చయినా వెరవకుండా తనను తాను మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించారు. పుట్టినరోజు సాకుతో కేంద్ర, రాష్ట్ర మంత్రులను, విదేశీయులను కూడా భక్తులుగా పిలిపించుకొని మరీ ఉపన్యాసాలు ఇప్పించారు.
బాల సాయిబాబా శ్రీనిలయంలో జరిగిన తన 54వ పుట్టినరోజుతో పాటు సంక్రాంతి వేడుకలను అత్యంత కోలాహలంగా చేసుకున్నారు. ఈ స్వాములోరు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్రమంత్రలు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా లాంటి ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించి ప్రత్యేకత కోసం పరితపించారు. లోగుట్టు ఏంటో తెలియదు కానీ... ప్రజాప్రతినిధులు సైతం బాలసాయిబాబాను పొగడ్తలతో ముంచెత్తారు. విదేశీ భక్తులు సైతం బాబా భజనలో తరించారు.
ఇక ఎప్పుడూ శాంతి వచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే బాలసాయి తాజాగా రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున పడ్డ సమయంలో పల్లెత్తు మాటకూడా మాట్లాడని బాబా ఇపుడు కర్నూలును రాజధాని చేయాలంటున్నారు. అంతేకాదు, సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేస్తానంటే తనకున్న ఆస్తిలో 500 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ఉదారంగా ప్రకటన చేసి పారేశారు.
బాల సాయిబాబాకు ఇంతకు ముందే ప్రజల్లో ఒకరకమైన ఇమేజ్ ఉంది. అసలు బాల సాయిబాబా అనగానే... ఆరోపణలు, కేసులు, అక్రమాలే గుర్తొస్తాయి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల ఆస్తులకు ఎదిగారని కొందరు అంటారు. బాల సాయిబాబా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు. మరెన్నో ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కేసులో... న్యాయస్థానం ఈ బాబాను భూ కబ్జాదారునిగా నిర్థారించింది. ఇలాంటి పరిణామాలే బాబాకు ఇబ్బంది మారాయి.
ప్రజల్లో చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ఎన్ని విన్యాసాలు.. సారీ మహిమలు ప్రదర్శించినా నమ్మేవారు కరువయయ్యారు. అందుకే ముందుగా తన మీదున్న మచ్చల్ని పోగొట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకున్నారు. ఇక బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే వారు ఏ రేంజికి ఎదిగారో చెప్పనవసరం లేదు.