రుద్రాయ.. భక్త ప్రియాయ
శివుడు...సృష్టి స్థితి లయకారుడు. ఆది భిక్షువు. జ్ఞానచక్షువు. ప్రణవనాద స్వరూపుడు. అభిషేక ప్రియుడు.భోళా శంకరుడు. అడిగినంతనే వరాలిచ్చు నీలకంఠుడు. అన్నింటికీ మించి అతి నిరాడంబురుడు. అందుకే ఎవరైనా ముందుగా మొక్కేది శివయ్యకే. ప్రణమిల్లేది శుభంకరుడైన శంకరునికే. ఇలా శివరాత్రి వేళ జిల్లా అంతటా భక్తులు ఓంకారం జపించారు. పంచాక్షరి పఠించారు. తన్మయత్వంతో ఊగిపోయారు. ప్రళయ భయంకరుడు ప్రసన్నుడు కావాలని వేడుకున్నారు. ఢమరుకాలు మోగించారు. తాండవ మాడారు. శివం...సత్యం అంటూ మురిసి పోయారు.
నమో...బాలబ్రహ్మేశ్వరాయా!
అలంపూర్, న్యూస్‌లైన్: ‘బ్రహ్మశోయం సవిశ్వేసః సాకాసి హేమలాపురీ’ అంటూ భక్తులు బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని స్మరిస్తూ దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, నదీయతల్లికి దీపాలు వదులుతూ గంగపూజలు చేశారు.
బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఏకవార రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, భేరీ పూజలు, ఆవాహిత దేవతా పూజలు, అష్టదిక్పాలకులకు బలిహరణ, విశేష సమర్పణ, చతుషష్టి పూజలు, రాత్రి 9:30 నుంచి యామపూజలు నిర్వహించారు. 24 ఆలయాల సముదాయమైనపాపనాశేశ్వర స్వామి, సంఘమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. జ్యోతిర్లింగార్చనలు, బిల్వాష్టకాలు, రుద్ర, నమక, చమకాలతో శివుడిని ప్రార్థించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేస్తు పంచామృతాలతో అభిషేకించారు.