శాడిస్ట్ భర్తపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: కట్టుకున్న భార్య నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో పెడతానని వేధిస్తున్న ఓ శాడిస్ట్ భర్తపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లైన ఆరునెలలకే తనకు విడాకులు ఇవ్వాలని భర్త వేధిస్తున్నాడని ఓ బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు... బాలనగర్ రాజుకాలనీకి చెందిన భాస్కర్‌తో ఆరు నెలల క్రితం ఉప్పల్‌కు చెందిన ఓ యువతితో పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది.
నెల రోజులు సవ్యంగా సాగిన వీరి కాపురంలో విభేదాలు వచ్చాయి. విడాకులివ్వాలని భాస్కర్ చేస్తున్న ఒత్తిడికి ఆమె తలొగ్గలేదు. తనను వదిలిపెడితే నెలకు లక్ష రూపాయలు సంపాదించే యువతి వస్తుందని భాస్కర్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. బెడ్రూమ్లో రహస్యంగా తీసిన వీడియోలు యువతి స్నేహితులకు చూపిస్తానని బెదిరించేవాడు.
గతంలో కూడా ఇలాగే తీసిన ఇతర యువతుల నగ్న దృశ్యాలను కూడా చూపించేవాడు. తనను వదిలిపెట్టకపోతే నగ్న దృశ్యాలను నెట్, సెల్‌ఫోన్ ద్వారా అందరికి పంపిస్తానని బెదిరించాడు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.