balanced food
-
‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా?
పిల్లలు చాలా పనుల్లో పెద్దలను అనుకరిస్తారు. చైనాలో ఒక పిల్లవాడు నిపుణుడైన చెఫ్‌ను అనుకరిస్తూ జనం హృదయాలను దోచుకుంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూనే, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్లో నివసిస్తున్న అతని తల్లి, తమ పిల్లవాడు నెలల వయస్సులో వంట చేయడంపై ఆసక్తిని కలిగి ఉన్నాడని గ్రహించింది. పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో చెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించింది. వీడియోలో ఆ పిల్లాడు గరిటెతో పాన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ఈ వీడియోను ఒలివియా వాంగ్ అనే యూజర్ షేర్ చేశారు. ‘ఈ పిల్లాడు వంట పాన్‌ను అంత వేగంగా ఎలా తిప్పుతున్నాడు? పిల్లాడి వంట ప్రతిభ అద్భుతంగా ఉంది’ అంటూ ఫొటో కామెంట్ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘మూడేళ్ళ పిల్లాడికి నా కంటే బాగా వంట చేయడం వచ్చని తెలిసి, తట్టుకోలేకపోతున్నాను’ అని రాశారు. కాగా ఏడాది క్రితం ఇటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఒక పిల్లాడు అద్భుతంగా వంట చేస్తున్నాడు. @sonikabhasin పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. వీడియో ప్రారంభంలో ఆ పిల్లాడు స్టూల్‌పై నిలబడటాన్ని గమనించవచ్చు. అప్పుడు ఆ పిల్లాడిని ఏం చేస్తున్నావని అతని తల్లి అడిగినప్పుడు ‘ఫ్రైడ్ రైస్’ అని ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చాడు. ఈ వంటకంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, క్యాప్సికమ్ జోడించానని కూడా చెప్పాడు. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? How come this little boy can handle this cooking pan so swiftly and his cooking skill is so amazing~#cooking #China pic.twitter.com/i48YcazOwZ — Olivia Wong (@OliviaWong123) February 14, 2023 -
సమతులాహారం... అందని ద్రాక్షే
డి.శ్రీనివాసరెడ్డి: పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు సగం ఉడికిన వంటకంలా ఉన్నాయని ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సదస్సులో అన్నారు. ‘ఇంకా నయం. మోదీ సర్కారు మాదిరిగా నోట్ల రద్దు, జీఎస్టీ బాదుడు, పెట్రో వాతలతో తినడానికే వీలు కాని మాడిపోయిన వంటకమైతే మన్మోహన్ తయారు చేయలేదు’ అంటూ కాంగ్రెస్‌కే చెందిన మరో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రిటార్టిచ్చారు. వంటకాల గోల ఎలా ఉన్నా సగటు భారతీయులు సరైన తిండి తినే భాగ్యానికి నోచుకోవడం లేదు. వారికి సమతులాహారం విలాస వస్తువుగా మారుతున్న దుస్థితి దాపురిస్తోంది...! ఆహారోత్పత్తుల ధరలు కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆహార ధాన్యాలు, ఇంధనం ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు తదితరాలు ఇందుకు కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి చెప్పారు. ► దేశంలో ఏకంగా 71 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ పత్రిక సంయుక్త నివేదిక తేల్చింది. ప్రపంచవ్యాప్త సగటు (42 శాతం) కంటే ఇది చాలా ఎక్కువ! ► సగటు భారతీయ కుటుంబపు ఆహార ఖర్చు గత పదేళ్లలో అక్షరాలా రెట్టింపైంది. ► ముగ్గురుండే కుటుంబానికి వారానికి ఐదు లీటర్ల పాలు, రెండేసి కిలోల బియ్యం, గోధుమ పిండి, టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, లీటరు నూనె, పప్పు ధాన్యాలు, పండ్లు అవసరం. ► వీటన్నింటి ధరలూ ఆహార పదార్థాల ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ప్రకారమే 2014 నుంచి గత ఎనిమిదేళ్లలోనే 80 శాతం దాకా పెరిగాయి. ► గత ఏడాదిలో చూసుకున్నా దాదాపు 10 శాతం పెరిగినట్టు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. ధరాభారంతో బెంబేలు ఆదాయం మూరెడు పెరిగితే ధరలు బారెడు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. దాంతో సగటు పౌరునికి పౌష్టికాహారం నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. కుటుంబ ఆదాయంలో ఆహార వ్యయం 63 శాతానికి మించితే వారికి పౌష్టికాహారం దూరమైనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ► ఫలితంగా 21 ఏళ్ల వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లకు బదులు 35.8 గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ► 300 గ్రాముల కూరగాయలకు బదులు 168.7 గ్రాములే అందుతున్నాయి. ► ఈ పౌష్టికాహార లోపం ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలకు దారితీస్తోందని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు హెచ్చరిస్తోంది. మన థాలి ఖరీదెంత? సగటు భారతీయుడు తినే థాలి (సమగ్ర భోజనం) ఖరీదును తొలిసారిగా 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2020–21లోనూ మరో ప్రయత్నం చేశారు. వాటిలో తేలిందేమిటంటే... ► శాకాహార భోజనం ఖరీదు అండమాన్‌లో అతి ఎక్కువగా రూ. 38.7 , యూపీలో అతి తక్కువగా 23.1 రూపాయలు. ► ఐదుగురున్న కుటుంబపు నెలవారీ భోజన ఖర్చు 2015లో రూ.4,700 ఉంటే ఇప్పుడు రూ.6,700కు పెరిగింది. ► ఓ మాదిరి వ్యక్తి రెండు పూటల ఇంటి భోజనానికి 2015లో సగటున రూ.32 ఖర్చయితే ఇప్పుడు రూ.44కు పెరిగింది. -
మూడొంతుల మందికి మంచి తిండి కలే
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ మేగజీన్ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. -
మీ ఆహారపు అలవాట్లు సరియైనవేనా...!
మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. మంచి ఇమ్యూనిటీ రావడం తప్పక జరుగుతుంది. అయితే ఒకవేళ మన ఆహారపు అలవాట్లు అంతగా బాగా లేవనుకోండి. వాటి ప్రతికూల ప్రభావాలు తక్షణం కనిపిస్తాయి. ఇటీవల మనలో చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే ఉబ్బుగా మారి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం చూస్తుంటాం. అది ఆహారపు అలవాట్లలో తేడా వల్ల చాలామందిలో కనిపించే తొలి లక్షణం. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మంచితో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుని, ఆ మేరకు మంచి ఆహారపు అలవాట్లును అనుసరించడం ఎందుకు అవసరమో తెలిపే కథనం ఇది. మనకు చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొందరు పొద్దున్నే లేచీ లేవగానే కాఫీ తాగేస్తారు. అదీ పరగడుపున. అలా చేస్తేగానీ వాళ్లల్లో కొన్ని జీవక్రియలు మొదలుకావు. అలా కాఫీ తాగందే పొద్దున్నే టాయెలెట్ వెళ్లాల్సిన ప్రక్రియ సజావుగా జరగదని చాలామంది అంటుంటారు. ఇదే సూత్రాన్ని కొందరు సిగరెట్ విషయంలో వల్లిస్తుంటారు. నిజానికి పొద్దున్నే పరగడుపున కాఫీ తాగడమే ఒక ఆహారపరమైన దురలవాటు అనుకుంటే.. సిగరెట్ అంతకంటే చెడు అలవాటు. కానీ ఈ రెండింటినీ అనుసరించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. సిగరెట్‌ను డైట్ (ఆహారపు) అలవాటుగా పరిగణించకపోయినా... అలవాట్ల గురించి చెప్పేందుకు అదో ఉదాహరణ. నిజానికి పొద్దున్న లేవగానే కాఫీ తాగడానికి బదులుగా మంచినీళ్లు తాగడం ఓ మంచి అలవాటు. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉండటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు మేలు చేసే కొన్ని మంచి ఆహారపు అలవాట్లును చూద్దాం. మంచి ఆహారపు అలవాట్లు ఇవి... పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకపోవడం : పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకపోవడం మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. పగటివేళ మనం పొద్దున్న లేచాక... కనీసం ఐదు లేదా ఆరు గంటలు వ్యవధిలో ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి జీవక్రియలకు అవసరమైన ఇంధనం అందుతూ ఉంటుంది. కానీ... మనమందరం సగటున దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రపోతుంటాం. నిద్రకు ఉపక్రమించే ముందర కనీసం గంట ముందుగా భోజనం చేస్తామనుకుంటే.. అలాగే నిద్రలేచాక మరో గంట తర్వాత తింటామనుకుంటే... దాదాపు 10 గంటల పాటు జీర్ణవ్యవస్థకు ఆహారం అందదు. అందుకే మన దేహ అవసరాలకూ, జీవక్రియలకూ భోజనం అందించాల్సినందున ‘బ్రేక్‌ఫాస్ట్’ తప్పనిసరి. పైగా ఉదయం మన రోజుమొదలు కాగానే ఆరోజంతా కావాల్సిన శక్తి (ఎనర్జీ)కి ప్రధాన వనరు ‘బ్రేక్‌ఫాస్ట్’. కాబట్టి ఇతర ఏ పూట భోజనంతో పోల్చినప్పటికీ ‘బ్రేక్‌ఫాస్ట్’ మాత్రం తప్పక తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఓ సామెత కూడా ఉంది. ‘‘బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు’’ అని నానుడి. పోషకాలన్నీ లభ్యమయ్యే సమతుల ఆహారం : మన భోజనంలో ప్రధానంగా అన్ని రకాల పోషకాలు ఉండాలి. అంటే... తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, కణాలూ కణజాలాలలను రిపేర్ చేసి, వాటిని నిర్మించే ప్రోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతోపాటు, విటమిన్లు, మినరల్స్ (ఖనిజ లవణాలు... మళ్లీ ఇందులోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు)... ఇవన్నీ ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్డ్) అంటారు. ఇవన్నీ ఉండాలంటే మన భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ప్రోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతో పాటు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను సమకూర్చే తాజాపండ్లు తీసుకోవాలి. చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం : మనం తినే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. అంటే ఉదయపు ఉపాహారం(బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్), సాయంత్రపు పలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం అన్నది జీర్ణవ్యవస్థపై భారం పడనివ్వదు. ఎప్పుడూ శరీరానికి అవసరమైన శక్తి క్రమబద్ధమైన రీతిలో అందుతుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని చేయవచ్చునని అనుకోవడం వల్లనో కొందరు రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినేవారిలో పొట్ట ఉబ్బరంగా ఉండటం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే ఎంతో అసౌకర్యమైన రీతిలో పొట్ట ఉబ్బిపోవడం, తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉందన్న భావన, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యమైన రీతిలో నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం చాలా సాధారణం. దీనితో పాటు ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం కూడా మంచి ఆహారపు అలవాట్లలో ఒకటి. నీళ్లు ఎక్కువగా తాగడం: మన శరీరంలోని 75 శాతం కేవలం నీటినే కలిగి ఉంటుంది. మనలోని ద్రవాలను కోల్పోవడం అన్నది ఒక్కోసారి ప్రాణానికే అపాయం. ఇలా జరగడాన్ని ‘డీ–హైడ్రేషన్’గా చెప్పవచ్చు. వేసవికాలంలో ఈ పరిణామం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అందుకే మనం ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం అవసరం. పైగా మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలు చేరడం అన్నది నీళ్లలో ఉండే లవణాల ద్వారానే సాధ్యం. ఇందుకోసమైన పుష్కలంగా నీళ్లు తాగుతుండటం అవసరం. చెడు ఆహారపు అలవాట్లివి... మంచి ఆహారపు అలవాట్లుగా పైన పేర్కొన్న వాటిని అనుసరించకపోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువ పరిమాణంలో తక్కువ తినడం, తాజాపండ్లు తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే దీనికి తోడు మరికొన్ని అంశాలు కూడా ఇటీవలి ఆధునిక జీవనశైలిలో మనకు అలవాడుతున్నాయి. ఉదాహరణకు... జంక్‌ఫుడ్ తినడం : మార్కెట్లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం అన్నది చెడు అలవాట్లలో ముఖ్యమైనది. వాటిల్లో ఉండే రిఫైన్డ్ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి వాడే కొన్ని అనారోగ్యకరమైన నూనెలు, ఆహారపదార్థాలను ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాడే కొన్ని రంగుల వల్ల ఇలాంటి జంక్‌ఫుడ్ కారణంగా అనేక క్యాన్సర్లు కూడా వస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. మితిమీరి తీపిపదార్థాలు తినడం : మనం తీసుకునే పదార్థాలలో తీపిని అందరూ ఇష్టపడతారు. ఐతే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల నోటిలో నుంచే నష్టాలు మొదలవుతాయి. పళ్లు పాడైపోవడం, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెరగడం వంటి నష్టాలు సంభవిస్తాయి. అంతేకాదు... క్యాన్సర్ కణాలకు తీపి పదార్థాలంటే చాలా మక్కువ. అందుకే మితిమీరి తీపిపదార్థాలు తినడం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఆహారాల్లో తీపి పదార్థాలను చాలా ఎక్కువగానూ / మరీ మితిమీరి గానీ తినడం సరికాదు. ఇక కొంతమంది తమ ఆహారపు అలవాట్లలో టీ, కాఫీలు మితిమీరి తాగుతుంటారు. ఇలా రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి, మితిమీరి కాఫీ, టీలు తాగడం తాగడం ఒక అనర్థమైతే... అందులో ఉండే తీపి వల్ల కూడా మన ఆరోగ్యానికి మరింత చేటు జరుగుతుంది. ఇక తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న తర్వాత అరగంట పాటు గానీ టీ తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్ ఒంటికి పట్టదు. కూల్ బీవరేజెస్ : మనలో చాలామంది కోలా డ్రింకులు, శీతల పానియాలను తాగుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫిన్ నిద్రాభంగం కలిగిస్తుంది. దీనివల్ల మళ్లీ అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక వీటిలోని చక్కెరల వల్ల... ముందుగా పేర్కొన్నట్లు మితిమీరిన తీపిపదార్థాల వల్ల కలిగే అనర్థాలన్నీ కలుగుతాయి. పైన పేర్కొన్న అలవాట్లలో మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకుని, చెడ్డవాటిని దూరం చేసుకుంటే చాలా కాలం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆల్కహాలిజమ్ అతి పెద్ద చెడు అలవాటు ఆల్కహాల్ ఎలాగూ చాలా చాలా ప్రమాదకరమైన ఆహారపు అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకోవడం చేస్తుంటారు. ఈ రెండింటి దుష్ఫలితాలు కలిసి రెట్టింపుగా పరిణమిస్తాయి. ఆల్కహాల్ తాగిన సమయంలో వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వేపుళ్లు ఎలాగూ మంచి ఆహారపు అలవాటు కాదు. పైగా ఆల్కహాల్ వల్ల కడుపులోని లైనింగ్స్ దెబ్బతినడం మరో ప్రమాదం. దాంతో మళ్లీ అసిడిటీ, అల్సర్లు వస్తాయి. ఆల్కహాల్ లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే అస్తవ్యస్తం చేస్తుంది. అందుకే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ -
చెమట పట్టడం శరీరానికి మంచిదేనా?
న్యూఢిల్లీ: సాధారణంగా మనిషికి అధికంగా చెమట పట్టిందంటే ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అధికంగా చెమట వచ్చినప్పటికి అనారోగ్యానికి కారణమని కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?. మరి ఇందుకు సంబంధించిన వాస్తవాలను విశ్లేషిద్దాం.. మనిషి ఆరోగ్యానికి చెమట ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడితో చెమట సాధారణం కంటే అధికంగా వస్తుంది. వేసవిలో శ్వేధం అధికంగా స్రవించడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ద్రవాలను కోల్పోతాం. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు విపరీతమైన వేడి, తేమ (గాలిలో ఆవిరి) వల్ల జుట్టు పొడిబారుతోంది. ఒత్తయిన జట్టును సొంతం చేసుకోవాలంటే నిత్యం నీటితో శుభ్రం చేసుకోవాలి. కానీ కొన్ని కాస్మోటిక్ కంపెనీలు చమట పట్టడాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే కంపెనీల ప్రకటనలను చర్మ వ్యాధి నిపుణులు కొట్టిపారేశారు. ఆరోగ్యానికి చెమట ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు పేర్కొంటారు. మనిషి చాలినంత చెమటను బయటకు స్రవించడం ద్వారా మొఖం మీద మొటిమలు రాకుండా చెమట గ్రంథులు నిరోధిస్తాయని అంటున్నారు. చర్మ సంరక్షణకు నిరంతర వ్యాయామంతో పాటు సమతుల ఆహారం (balanced diet) ఎంతో ముఖ్యం. జిమ్‌లో నిరంతరం వర్క్‌వుట్ చేసే వారి చర్మం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాలసిన చెమట స్రవించడం వల్ల మనిషికి దాహం వేస్తుంది. దీంతో దాహం తీరడానికి ఎక్కువగా నీళ్లను తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం నుంచి చెమట స్రవించడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు విడుదలవుతాయని.. ఇవి పొడిబారిన చర్మాన్ని, యూరియా, యూరిక్ యాసిడ్, చెడు బ్యాక్టీరియా,అలర్జీ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. వ్యాయాయం పూర్తయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని.. ముఖ్యంగా మెడ ప్రాంతంపై చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి నిత్యం శుభ్రం చేసుకోవాలని, శరీరాన్ని నిత్యం సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యం
అనంతపురం టౌన్ : సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రావెల సుధీర్‌బాబు తెలిపారు. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం డీఆర్డీఏ అభ్యుదయ భవన్లో పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. కిశోర బాలికల పోషకాహారం, యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి జబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారోగ్య నర్సింగ్ అధికారి రాణి, పీఓడీటీటీ సుజాత, డెమో హరిలీలాకుమారి, డిప్యూటీ డెమో సుధాకర్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషర్ నాగరాజు, ఐసీడీఎస్ అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ కృష్ణకుమారి, సూపర్వైజర్లు కొండమ్మ, చంద్రకళ, లలిత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.