అంతర్జాతీయ గేయానువాదకుడు... అక్షరారాధకుడు!
‘ఆకలి మంటచె మలమలమాడే అనాథులందరు లేవండోయ్..!’ ఇవాళ్టికీ ఈ పల్లవి, ఆ వెంట వచ్చే చరణాలు ఎంతోమందికి సుపరిచితం. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంలో విస్తృత ప్రాచుర్యం పొంది, లక్షల మంది శ్రమజీవులు, కమ్యూనిస్టులు పాడు కుంటున్న గేయం. ప్రపంచ శ్రామిక గీతం ‘కమ్యూ నిస్ట్ ఇంటర్నేషనల్’కు అచ్చ తెలుగు అనువాదం. అలా తెలుగులోకి దాన్ని తొలిసారి అనువదించిన వ్యక్తి - బాలాంత్రపు నళినీకాంతరావు.
కాకినాడలో బి.ఎ. చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఈ గేయం రాసిన వైనం ఆశ్చర్యం కలిగి స్తుంది. ‘ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ’ స్థాపన (1936 జనవరి 29) కన్నా దాదాపు ఏడాది ముందే ఈ ‘అంతర్జాతీయ శ్రామిక గేయం’ తెలుగులోకి అనువాదం కావడం ఆసక్తికరం. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆ రోజుల్లో కాకినాడకు తరచూ వస్తూ, విద్యార్థులకు రాజకీయ శిక్షణనిచ్చే వారు. ఆయన 1781లో ఫ్రెంచ్ రచయిత యుజెనీ పాటియార్ రాసిన ‘కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్’ ఇంగ్లిష్ మూలాన్ని నళిని గారి అన్నయ్య బాలాంత్రపు సత్యనారాయణరావుకి ఇచ్చి, నళి నితో తెలుగులోకి అనువాదం చేయించారు. గద్దె లింగయ్య సం పాదకులైన ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ తొలి పత్రిక ‘ప్రభ’ పక్ష పత్రికలో 1935 ఏప్రిల్ 30న ఈ గేయం ప్రచురితమైంది. ఇవాళ్టికీ శ్రామికోద్యమానికి ఊతంగా నిలి చే ఈ పాటను తెలుగులోకి తెచ్చిన నళినీకాంతరావు కు ఇది శత జయంతి వత్సరం.
సరిగ్గా నూరేళ్ళ క్రితం 1915 మే 9న తూర్పు గోదావరి జిల్లా బాలాంత్రం దగ్గర కుతుకులూరులో నళిని జన్మించారు. సుప్రసిద్ధ ‘వేంకట పార్వతీశ కవు లు’ ఇద్దరిలో ఒకరైన బాలాంత్రపు వేంకటరావు గారి పెద్ద కుమారుడు ఆయన. లలిత సంగీత వాగ్గేయకా రులు బాలాంత్రపు రజనీకాంత రావుకు స్వయానా అన్నయ్య. కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.ఎ. చేసిన నళిని 1937లో మద్రాసు వెళ్ళి, ఆంగ్ల సాహిత్యంలో మాస్ట ర్స్ డిగ్రీ చదివారు. దుర్గాబాయ్ గారి చెన్నపురి ‘ఆంధ్ర మహిళ’ సంస్థలో 1940 నుంచి ’47 దాకా విద్యా విభాగానికి పర్యవేక్షకుడిగా పని చేశారు. ప్రముఖ జర్నలిస్టు కోటంరాజు రామారావు దగ్గర ‘ఇండియన్ రిప బ్లిక్’లో 1948లో పత్రికారచనలో శిక్షణ పొందిన నళిని ప్రధానంగా జర్నలిస్టుగా జీవించారు. తొలి రోజుల్లో గోరాశాస్త్రి వద్ద ‘తెలుగు స్వతంత్ర’లో, ‘ఆంధ్రప్రభ’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. పదిహేనేళ్ళ వయసులోనే ‘ఆంధ్ర ప్రచా రిణి’ పత్రికకూ, ‘ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల’కు ప్రచురణ కోసం వచ్చే రచనల్ని పరిశీలిస్తూ తండ్రి గారికీ సహ కరించిన నళిని చివరి దాకా సాహిత్య, సంగీతాలను వదులుకోలేదు.
గమ్మత్తేమిటంటే ప్రపంచ కార్మికులను చైతన్య పరిచే ‘ఆకలిమంటచే...’ గేయాన్ని అనువదించిన ప్పుడు దాని కింద నళిని తన పేరు రాసుకోలేదు. అందుకే, తెలుగునాట ఈ గేయం బహుళ ప్రచారం పొందినప్పటికీ, రచయిత ఎవరో మొదట్లో తెలియ లేదు. అది నళిని అనువాదమని తరువాత బయట కొచ్చింది. అలాగే, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ సొత్తు అయిన గేయాన్ని రాసి, సంప్రదాయ సాహిత్య ప్రచు రణలకు సంపాదకుడిగా, ఇంగ్లిష్ జర్నలిస్టుగా పని చేసిన నళినీకాంతరావు గురించి తెలియని తరానికి ఆయనను గుర్తు చేయడానికి ఈ శతజయంతి సం దర్భం ఒక చిన్న వేదిక.
(మే 9న బాలాంత్రపు నళినీకాంతరావు శత జయంతి)
(1915 మే 9 - 2005 ఏప్రిల్ 29)
- రెంటాల జయదేవ
jayadeva.sakshi@gmail.com