పేద కుటుంబాల్లో ‘కల్లో’లం!
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని గౌరిశంకర్ కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. ప్రతిరోజు సేవించే కల్లు లభించకపోయేసరికి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాస జలపతి మత్తెక్కించే కల్లు తాగే అలవాటుంది. అధికారుల దాడులతో ఆ మందు లభించకపోయేసరికి వింతగా ప్రవర్తిస్తూ ఇల్లాలిపైనే హత్యాయత్నం చేశాడు. అతడు జైలు పాలు కావడంతో కుటుంబం వీథినపడింది.
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు చాలదన్నట్లుగా.. ఇప్పుడు కల్లు బాధితుల బలవన్మరణాలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అనేక కుటుం బాలు వీధిన పడుతున్నాయి. వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి.
పిల్లల చదువులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఆ కుటుంబాల పోషణ భారమవుతోంది. ఈ మత్తు కల్లు కారణంగా తెలంగాణలో దాదాపు వంద మందికిపైగా మరణించారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలో 80 మందికిపైగా మరణిస్తే.. ఎక్సైజ్, పోలీసుల లెక్కలు మాత్రం 42 మంది చనిపోయినట్లు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 11 మంది, ఆదిలాబాద్‌లో దాదాపు 15 మంది మరణించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఈ స్థాయి మరణాలు నమోదయ్యాయి.
10 జిల్లాల్లో 7,574 దుకాణాలు
రాష్ట్రంలోని పది జిల్లాల్లో మొత్తం 7,574 కల్లు దుకాణాలు అధికారికంగా నడుస్తున్నాయి. మరో రెండు వేల వరకు అనధికారికంగా విక్రయాలు సాగుతున్నాయి. నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మినహా తాటి, ఈత చెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ మత్తు కలిపి అమ్మే కల్లు విక్రయాలు తక్కువే.
మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్‌లకు సంబంధించి కల్లు వినియోగానికి అల్ఫాజోలమ్, చక్కెర, పిండి, డిటర్జంట్ పౌడర్ తదితర వాటిని కలిపి కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్న ఘటనలు ఉన్నాయి.
కౌన్సెలింగ్ ఏదీ?..: మత్తు కల్లుకు బానిసలైన వారు ఆ వ్యసనం నుంచి బయటపడలేక.. అది లేకుండా జీవించలేక అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వం కల్లులో మత్తునిచ్చే డైజోఫామ్,అల్ఫాజోలమ్, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)తో పాటు ఇతర రసాయనాల వినియోగంపై పెద్దగా పట్టించుకోకుండా.. ఒక్కసారిగా దాడులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
మత్తు అధికంగా ఉండే కల్లు తాగుతున్న వారికి.. ఆ మత్తు నుంచి బయటపడడానికి వీలుగా ఎక్కువ సంఖ్యలో కౌన్సెలింగ్ కేంద్రాలు, డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు ఏవీ చేపట్టలేదు. కల్లులో కలిపే మత్తు పదార్థాలు కాస్తా.. నాడి మండలంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంచానికే పరిమితమయ్యా
మూడు నెలల క్రితం కల్లులో మత్తు తగ్గడంతో నా ఆరోగ్యం మూడు నెలలుగా క్షీణించడంతో మంచానికే పరిమితమయ్యాను. గతంలో నా కుటుంబ పోషణ కోసం వడ్రంగి పనితో పాటు కమ్మరి పని చేసుకుంటూ పొట్టగడిపేవాడిని. ప్రస్తుతం కొడుకులు అన్నం పెడితే గానీ పూట గడవని పరిస్థితి ఉంది.
- ఇనుగుర్తి నారాయణ, తిమ్మాపూర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
ఆగమైన కుటుంబం
కల్లులో మత్తు తగ్గడం వల్ల వికృత చేష్టలతో భర్త నన్ను చంపేందుకు ప్రయత్నించాడు. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆయన జైలులో ఉన్నాడు. నేను నా ఇద్దరు పిల్లలతో బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. కల్తీ కల్లుతో నా కుటుంబం ఆగమైంది.
-బాస రాధ, తిమ్మాపూర్, జగిత్యాల
పిల్లలను చదివించలేకపోతున్నాం..
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన బిట్ల అశోక్(35) సెప్టెంబర్ 25న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుం బం వీధిన పడింది. ప్రస్తుతం పిల్లలను చది వించలేక పోతున్నా.
-బిట్ల సునీత, నిర్మల్
* కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన కోడూరి వైకుంఠం మృతితో ఆయన కుటుంబం అనాథగా మారింది.
* జగిత్యాల డివిజన్లోని తిమ్మాపూర్‌లో 23, మోతెలో 18 మంది వికృత చేష్టలతో కుటుంబానికే దూరమయ్యారు.
* తిమ్మాపూర్‌కు చెందిన ఇనుగుర్తి నారాయణ కల్తీ కల్లుతో అనారోగ్యం బారినపడి మంచానికే పరిమితయ్యాడు.
* ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా రెక్కాడితే గానీ, డొక్కాడని నిరుపేద కూలీలే.
* బాసరలో ఆరుగురు, నిర్మల్‌లో ఏడుగురు బాధితులు మరణించారు.
* మహబూబ్‌నగర్ జిల్లాలో కల్లు లేని కారణంగా మరణించిన వారు 80 మంది దాకా ఉన్నారు.
* రంగారెడ్డి జిల్లాలో తాండూరు, బషీరాబాద్ ప్రాంతాలకు చెందిన దాదాపు 11 మంది మరణించారు.
* తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సుమారు 200మంది చికిత్స కోసం చేరారు.
నాలుగు జిల్లాలోనే అధికం: అకున్ సబర్వాల్
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే కల్లీకల్లు సమస్య ఎ క్కువగా ఉందని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు. ‘కల్లు సమస్య ఎక్కువగా ఉంది. మత్తు కోసం అల్పాజోలమ్ వినియోగిస్తున్నారు. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తోంది. ఈసారి కల్లు దుకాణాలపై దాడులు చేయడానికి ముందుగానే ఆసుపత్రులను సి ద్ధంచేస్తాం. గత సెప్టెంబర్‌లో దాడులతో ఒక్కసారిగా ఇబ్బందులు వచ్చాయి’ అన్నారు.