ఐక్యంగా హక్కులను కాపాడుకుందాం
ఐక్యంగా హక్కులను కాపాడుకుందాం
చెన్నూరు : కాపు, బలిజ, తెలగలందరూ ఐక్యంగా ఉండి జాతి హక్కులను కాపాడుకుందామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండల బలిజసంఘం అధ్యక్షుడు తోట లక్ష్మీనారాయణ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడం ఖచ్చితంగా జరుగుతుందని, ఇందుకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. కాపులంతా ఐక్యంగా పనిచేసినప్పుడే జాతికి దక్కాల్సిన హక్కులు, వాటాలు సాధించగలమని చెప్పారు. బీసీల్లో చేర్చేందుకు కమిషన్ నిర్ణయం త్వరితగతిన జరుగుతుందని, ఈమేరకు సీఎంపై వత్తిడి పెంచనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక బలిజ సంఘం నాయకుడు రవినాథ్ కాపు కార్పొరేషన్ ద్వారా విడుదలైన రుణాలు మండలంలో ఎవ్వరికి ఇవ్వలేదని, జన్మభూమి కమిటీల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా కాపువర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించేందుకు కృషిచేయాలని సీనియర్ నాయకుడు మాదినేని రామసుబ్బయ్య ముద్రగడకు చెప్పారు. ఈ విషయాలన్నింటిపై చర్చిస్తున్నామని అన్ని సమస్యలను పరిష్కారం కోసం అందరం ఐక్యంగా పోరాటాలు చేద్దామని ఆయన చెప్పారు. కాపు నాయకులు పీవీఎస్మూర్తి, రాము, కె.క్రిష్ణమూర్తి, నాగభూషణం, లోకనాథం, రాజగోపాల్, అతికారి రవికుమార్, ఆనంద్, సుబ్రమణ్యం, లక్షుమయ్యలు పాల్గొన్నారు. ముద్రగడ మొదట బ్రాహ్మణవీధిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు.