జీవితకాల నిషేధంపై శ్రీశాంత్ సవాలు!
న్యూఢిల్లీ: వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధం విధించడం అనాగరికమని అతని వ్యక్తిగత లాయర్ రెబెకా జాన్ అభిప్రాయపడ్డారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, దీన్ని కోర్టులో సవాలు చేస్తున్నామని చెప్పారు. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతనిపై బోర్డు వేటు వేసిన సంగతి తెలిసిందే.
బోర్డు నియమించిన సవాని కమిటీ అతనితో సహా నలుగురు ఆటగాళ్లను తప్పుబట్టింది. అయితే ఈ కమిటీ విచారణలో ఏ మాత్రం పసలేదని ఆమె ఆరోపించారు. కేవలం ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగానే విచారణను ముగించింది కానీ... సొంత దర్యాప్తుతో కాదని చెప్పారు. లోగడ ఫిక్సింగ్ ఉదంతాన్ని విచారించిన సెషన్స్ కోర్టు బలమైన ఆధారాలు లేవని వారికి బెయిల్ మంజూరు చేసిందని రెబెకా వివరించారు. కోర్టుకే లభించని ఆధారాలు బోర్డు కమిటీకి లభించాయా అని ఆమె ఎద్దెవా చేశారు.