అంతరిక్షానికి ఎగిరే బెలూన్.. సీట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు
... ఎస్.. ఆ బెలూన్ భూ వాతావరణ పరిధిని దాటి అంతరిక్షం వరకు వెళుతుంది.. మనుషులను తీసుకొని మరీ! ఫేక్ కాదు ఫ్యాక్ట్. ఫ్లొరిడాలోని ఓ టూరిజం సంస్థ స్పేస్ బెలూన్ సవారీని టేకాఫ్ చేయనుంది. సుమారు లక్ష అడుగుల ఎత్తుకు.. కేవలం రెండు గంటల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లగలదు. అక్కడికి చేరుకున్నాక మరో రెండు గంటలు ఆ అంతరిక్ష అందాలను వీక్షించడానికి, ఆస్వాదించడానికి అనువుగా అక్కడే చక్కర్లు కొడుతుంది.
ఈ షికారులో ప్రయాణికులకు కావాల్సిన ఆహారాన్ని టూరిజం సంస్థ వారే సరఫరా చేస్తారు. అంతేకాదు ఈ బెలూన్లో ఒక కిచెన్, బార్, బాత్రూమ్ కూడా ఉంటాయి. తిరిగి నేలకు చేరుకోడానికి మరో రెండు గంటలు. మొత్తం ఆరుగంటల ఈ ప్రయాణంలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే చోటు ఉంటుంది. బాగుంది కదూ! ఈ షికారును మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కూసింత కరుసవుద్ది మరి! జస్ట్ రూ. 93 లక్షలు చెల్లించి, సీట్ బుక్ చేసుకుని.. 2024 వరకు వేచి చూడండి.
హైడ్రోజన్ బెలూన్లు అంతపైకి ఎలా వెళ్లగలవనే కదా మీ డౌటా. ‘నాసా’ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయాణ నిపుణులు వివిధ ప్రయోగాలు చేసి అతి తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించారు. అది గురత్వాక్షరణ శక్తిని అధిగమించి అంతరిక్ష ప్రయాణానికి అనుకూలిస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించే తాజాగా.. ఫ్లొరిడాలోని ఓ సంస్థ అంతరిక్షంలోకి విమాన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విమానం మాదిరే ఈ బెలూన్ను నడిపేందుకూ ఒక స్పేస్ పైలట్, ఒక కో పైలట్ ఉంటారు. ప్రయాణికులు అంతరిక్ష సవారీని ఆస్వాదిస్తూ ఆ మధుర క్షణాలను బెలూన్ పారదర్శక గోడల నుంచి మీ మొబైల్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు.