సర్వం సిద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు-కృష్ణా శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ విధానంలో జరగనున్న ఎన్నికలకు జిల్లా నలుమూలలా ఏర్పాటు చేసిన 59 పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఓటు హక్కు కలిగిన 9,169 మంది ఓటర్లు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఓటు హక్కు కలిగిన వారిలో ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు, మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు ఉన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవకతవలకు ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో మొత్తం 18,931 మంది ఓటర్లుండగా మొత్తం 110 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో గుంటూరు జిల్లాలోని 9,169 మంది ఓటర్లు కోసం 59, కృష్ణా జిల్లాలోని 9,762 మంది ఓటర్లు కోసం 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా 57 మండలాల పరిధిలో ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, గుంటూరు నగర పరిధిలోని ఓటర్ల కోసం మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని శనివారం జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని సెయింట్ మహిళా బీఈడీ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి కె. నాగబాబు పర్యవేక్షణలో పోలింగ్ సామగ్రిని తరలించారు. పోలింగ్ ముగిశార జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్సులను జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.