బాల్‌థాక్రే హత్యకు కుట్ర
వీడియోలింకు వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి
తన భార్యకు ముంబై దాడి విషయం తెలియదని వ్యాఖ్య
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే హత్యకు లష్కరే తోయిబా కుట్రపన్నిందని.. 26/11 ఘటనలో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ఎప్పుడు వీలు చిక్కినా థాక్రేను మట్టుబెట్టాలనే లక్ష్యంతో లష్కరే ఒకరిని ప్రత్యేకంగా నియమించిందని.. అయితే, అతన్ని పోలీసులు పట్టుకోవటంతో ప్రయత్నం విఫలమైందని హెడ్లీ తెలిపాడు. అబు జుందాల్ తరపు న్యాయవాది అబ్దుల్ వాహబ్ ఖాన్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నపుడు హెడ్లీ ఈ వివరాలు వెల్లడించాడు. శివసేన కార్యాలయం ‘సేన భవన్’ను తను కూడా రెండుసార్లు సందర్శించినట్లు తెలిపాడు. ఈ ప్రయత్నం కచ్చితంగా ఎప్పుడు జరిగిందీ.. గుర్తురావటం లేదని కానీ.. పోలీసుల కస్టడీనుంచి ఆ లష్కరే ఉగ్రవాది తర్వాత తప్పించుకున్నాడని వెల్లడించాడు. 2009లో మరోసారి భారత్‌లో దాడులకు (అల్‌కాయిదా తరపున) వచ్చినపుడు ఖర్చుల కోసం అల్‌కాయిదా నాయకుడు ఇలియాస్ కశ్మీరీ రూ. లక్ష పాకిస్తానీ కరెన్సీ ఇచ్చినట్లు హెడ్లీ తెలిపాడు. ముంబై దాడులకు కారకులైన 10 మంది ఉగ్రవాదులను తనెప్పుడూ కలవలేదనీ.. కానీ, కసబ్ ఫొటోను మాత్రం ఇంట ర్నెట్లో చూశానన్నాడు.
‘ముంబై ఘటనతో మీరు సంతోషంగా ఉన్నారా?’ అన్న వాహబ్ ఖాన్ ప్రశ్నకు.. హెడ్లీ స్పందిస్తూ ‘అవునని చెప్పినా తప్పుడు సమాధానమే.. కాదని చెప్పినా తప్పుడు సమాధానమే అవుతుంది’ అని అన్నాడు. తన భార్య షాజియాకు ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదని హెడ్లీ పునరుద్ఘాటించాడు. షాజియా గురించి ప్రశ్నించటంతో హెడ్లీ-ఖాన్ మధ్య వాగ్వాదం జరిగిం ది. ‘మీరు అనవసరమైన, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. నోటికేదొస్తే దాన్ని అడగడం సరైంది కాదు’ అని అన్నాడు. కాగా, బాల్‌థాక్రేపై హిట్‌లిస్టులో ఉన్నారనే విషయం గర్వకారణమని శివసేన తెలిపింది. అయితే హెడ్లీ చెప్పేంతవరకు.. బాల్‌థాక్రేపై దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకోవడం.. అతడు తప్పించుకున్న విషయా న్ని ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు.