200 ఏళ్ల నాటి మందు సీసా!
సముద్రంలో ఏం దొరుకుతాయి.. మామూలుగా అయితే ఆల్చిప్పలు, ముత్యాలు, నిధి నిక్షేపాలు కదూ.. కానీ బాల్టిక్ సముద్ర గర్భంలో 200 ఏళ్లనాటి మద్యం సీసా ఒకటి తాజాగా దొరికింది. ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఓ నౌక శిథిలాల్లోంచి ఇది బయటపడింది. అది వోడ్కానో, జిన్నో ఇంతవరకు తెలియలేదు. అయితే.. ఆ మందు మాత్రం ఇప్పటికీ తాగడానికి భేషుగ్గా పనికొస్తుందని, ఏమాత్రం పాడవ్వలేదని, దాని వాసన కూడా చాలా బాగుందని పోలండ్లోని నేషనల్ మారిటైమ్ మ్యూజియానికి చెందిన ఆర్కియాలజిస్టు టామజ్ బెడ్నార్జ్ తెలిపారు. ఇది సుమారు 1806-30 ప్రాంతానికి చెందిన మద్యం సీసా.
అందులో 14 శాతం ఆల్కహాల్ డిస్టిలేట్ ఉందని ప్రాథమిక పరీక్షలలో తేలింది. బహుశా దీన్ని కొంతవరకు నీళ్లతో డైల్యూట్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. దీని అసలు బ్రాండ్ 'సెల్టర్స్' అని, ఇప్పటి రసాయన పరీక్షలు కూడా అదే బ్రాండు అని తేల్చాయని చెప్పారు. సాధారణంగా 'సెల్టర్స్' చాలా అత్యున్నత నాణ్యత కలిగినదని చెబుతుంటారు. అదే బ్రాండుకు చెందిన మద్యం, అది కూడా 200 ఏళ్లనాటిది కావడంతో దీనికి మహా గిరాకీ ఉండబోతోందని లెక్క!!